ఏఐ దుర్వినియోగంపై హీరోయిన్లు ఆగ్రహం!

Actresses outraged over AI misuse!Actresses outraged over AI misuse!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని  హీరోయిన్లను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలను సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో  పెరుగుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు  భంగం కలిగిస్తున్న ఈ అనైతిక చర్యలపై పలువురు స్టార్ హీరోయిన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించాల్సింది పోయి.. ఇలా ఇతరుల పరువు ప్రతిష్టలతో ఆటలాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఈ డిజిటల్ నేరాలపై టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా నటీమణులు గళం విప్పుతున్నారు.  మృణాల్ ఠాకూర్, రుక్మిణి వసంత్, రష్మిక మందన్న , కీర్తి సురేష్ తదితరులు ఏఐ దుర్వినియోగంపై తమ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ చిత్రాలను .. వీడియోలను అనధికారికంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై ఉపేక్షించేది లేదని హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి చర్యలు  తమను మానసి కంగా వేధించడమే కాకుండా సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైబర్ క్రైమ్ నిబంధనల ప్రకారం ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడేవారికి భారీ జరిమానాలు, కఠిన శిక్షలు తప్పవని వారు హెచ్చరించారు. సామాజిక మాధ్యమ వేదికలు కూడా ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను తక్షణమే గుర్తించి తొలగించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని  డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సాధారణ మహిళలు కూడా ఏఐ వేధింపుల బారిన పడుతుండటం ఆందోళనకరమైన పరిణామం.

టెక్నాలజీ అనేది మానవ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప తోటివారి జీవితాలను అభాసుపాలు చేయడానికి కాదని  ప్రముఖులు హితవు పలుకుతున్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలు మరింత కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. సెలబ్రిటీల హెచ్చరిక‌లైనా?కఠిన చ‌ట్టాలైనా? నెటిజన్లలో..  ప్రజల్లో నైతిక విలువలు పెరిగినప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుంది.

Mrunal Thakur expresses outrage over AI deepfakes