రీషూట్ వార్తలపై మేకర్స్ సీరియస్!
Is The Paradise in reshootనేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం `ది ప్యారడైజ్`. `దసరా` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమా అవుట్‌పుట్ పట్ల నాని సంతృప్తిగా లేరని అందుకే కీలక సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని దీంతో విడుదల ఆలస్యం కానుందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అధికారికంగా స్పందించి వదంతులకు చెక్ పెట్టింది.
సినిమా నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వీ సినిమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. రీషూట్ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. `ది ప్యారడైజ్ చిత్రం మొదటి రోజు నుండి ఎంతో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 100 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న విధంగానే జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక్క సీన్‌ను కూడా రీషూట్ చేయలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదు అని మేకర్స్ కుండబద్దలు కొట్టారు. తప్పుడు వార్తలను నమ్మద్దని అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అన్ని అడ్డంకులను అధిగమించి `ది ప్యారడైజ్` చిత్రాన్ని ఆగస్ట్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ మరోసారి ధృవీకరించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఆయా షేర్ సాంగ్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో ప్రమోషన్లను మరింత ఉధృతం చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.







































