ఏషియన్ గేమ్స్ 2026పై మాధవన్ తనయుడి ఫోకస్!
R Madhavan’s Son Vedant Eyes Asian Games 2026
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తనయుడు, ఈతగాడు వేదాంత్ మాధవన్ 2026 ఏషియన్ గేమ్స్‌కు సిద్ధమవుతున్నారు. జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరగనున్న పోటీలలో భారత్‌కు చెందిన 12 మంది ఈతగాళ్ల బృందానికి 21 ఏళ్ల వేదాంత్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటివరకు లాంగ్-డిస్టెన్స్ స్విమ్మింగ్‌లో రాణించిన వేదాంత్ ఈసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి 200 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెయిట్ ట్రైనింగ్, కికింగ్ , యాంకిల్ ఫ్లెక్సిబిలిటీని మెరుగు పరుచుకుంటూ శిక్షణ శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు వేదాంత్ వెల్లడించారు.
వేదాంత్ క్రీడా ప్రయాణం, ఆయనలోని క్రమశిక్షణ గురించి నటుడు మాధవన్ గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక తండ్రిగా పిల్లలలో క్రమశిక్షణ, గ్రిట్ (పట్టుదల) పెంపొందించడం చాలా ముఖ్యమని మాధవన్ తెలిపారు. వేదాంత్ స్విమ్మింగ్‌ను ఎంచుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి సాధన చేయడం అల వాటు చేసుకున్నాడని, ఆ క్రమశిక్షణ వల్ల రాత్రి 8 గంటలకే నిద్రపోవడం ఆయన జీవితంలో ఒక భాగమైందన్నారు . ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్న పిల్లలు జీవితంలో అనుకున్నది సాధించగలరని మాధవన్ అభిప్రాయపడ్డారు.
పిల్లలపై మన అభిప్రాయాలను రుద్దకుండా వారికి నచ్చిన రంగంలో స్వేచ్ఛను ఇవ్వాలని మాధవన్ సూచించారు. `నేటి తరం పిల్లలకు ప్రపంచంపై అవగాహన ఎక్కువ. వారికి ఇష్టమైన పనిని పదేపదే చేసేలా క్రమశిక్షణను నేర్పితే, వారు ఏ రంగంలోనైనా అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారు` అని వ్యాఖ్యానించారు. ఏషియన్ గేమ్స్ వేదికగా దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా వేదాంత్ సాగిస్తున్న కఠిన సాధనపై సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
















































