ప్రేక్షకులది న్యాయమైన కోపమే!
Madhavan Says Audience are the real Judge
సినిమా విడుదల కాకముందే ప్రేక్షకులు కోపగించుకోవడం ..విసిగిపోవడంపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడి ప్రవర్తనలో గర్వం ప్రదర్శితమైనా లేదా దర్శకుడు తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోయినా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో పూర్తిగా న్యాయం ఉందని మ్యాడీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ..సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ రోజుల్లో ప్రేక్షకులు ప్రతి విషయాన్ని ఎంతో సూక్ష్మంగా గమనిస్తున్నారని.. సినిమా ప్రమోషన్ల సమయంలో సెలబ్రిటీల ఓవరాక్షన్ .. అహంకారాన్ని వారు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేరని మాధవన్ స్పష్టం చేశారు. దర్శకులు హైప్ కోసం కాకుండా నిజమైన కంటెంట్‌పై దృష్టి పెట్టాలని.. కష్టపడి పనిచేయకుండా కేవలం స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే ప్రేక్షకులే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రేక్షకుల ఆలోచనా విధానం మారినప్పుడు చిత్ర పరిశ్రమ కూడా దానికి తగినట్లుగా మారాల్సిందేనని తేల్చి చెప్పారు.
మాధవన్ చేసిన వ్యాఖ్యలు సినీ ప్రముఖులకు దర్పణంలా నిలుస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్డమ్ అనేది ప్రేక్షకులిచ్చిన భిక్ష అని గ్రహించి ఎప్పుడూ వినయంగా ఉండాలనే సత్యాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడే ప్రస్తుత ట్రెండ్‌లో, నటీనటుల పద్ధతి కూడా మారాలనే మాధవన్ మాటలు ఆలోచింపజేస్తున్నాయి.







































