ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood industry Plans To Bring Flexible Pricing

మెట్రోల బాటలో టాలీవుడ్ టికెట్ రేట్లు!

 

తెలుగు చిత్ర పరిశ్రమలో టికెట్ ధరల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మెట్రో నగరాల్లో అమలవుతున్న ఫ్లెక్సీ ప్రైసింగ్ విధానాన్ని టాలీవుడ్‌లోనూ ప్రవేశపెట్టాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం ప్రకారం వారాంతాల్లో టికెట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంచి ప్రేక్షకుల రద్దీ తక్కువగా ఉండే పనిదినాల్లో (వీక్ డేస్‌లో) ధరలను తగ్గించడం జరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడిని త్వరగా రాబట్టడానికి  పనిదినాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచడానికి  డైనమిక్ ప్రైసింగ్ వ్యూహాత్మక మార్పుగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలు ఆహార పదార్థాల ఖర్చులతో విసిగిపోయిన  ప్రేక్షకుడు వారాంతాల్లో ధరలు మరింత పెంచితే థియేటర్లకు దూరం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలకే ప్రేక్షకులు అధిక ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని సాదాసీదా సినిమాలకు  ఫ్లెక్సీ రేట్లు ఓపెనిం గ్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. లాభాల వేటలో పడి సామాన్యుడికి సినిమా వినోదాన్ని దూరం చేయకూడదనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఫ్లెక్సీ ప్రైసింగ్ విజయవంతం కావాలంటే కేవలం రేట్లు పెంచడానికే పరిమితం కాకుండా, డిమాండ్ లేనప్పుడు పారదర్శకంగా ధరలు తగ్గించేలా ఉండాలి. `హనుమాన్` వంటి చిత్రాల విజయం తక్కువ ధర ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారో నిరూపించింది. కాబట్టి సినిమా బడ్జెట్ ,క్రేజ్‌ను బట్టి డైనమిక్ పద్ధతిలో ధరలు మారేలా ప్రభుత్వాలు, నిర్మాతలు , ఎగ్జిబిటర్లు సమన్వయంతో  నిర్ణీత పట్టికను రూపొందించాలి. అప్పుడే చిన్న సినిమాలకు ఆదరణ పెరగడంతో పాటు సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండే వినోదంగా మిగులుతుంది.
 

Tollywood Planning For Dynamic ticket pricingTollywood industry Plans To Bring Flexible Pricing