60 కోట్లకు చేరిన శ్రద్ధా కపూర్ ఫ్యామిలీ హోమ్!
Shraddha Kapoor's Rs 60 crore Juhu home
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన అపార్ట్‌మెంట్ అందాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సముద్ర తీరాన్ని తలపించే అందమైన దృశ్యాలు, ఆధునిక హంగులతో కూడిన ఇంటీరియర్స్, కుటుంబ జ్ఞాపకాలతో ఇల్లు ప్రత్యేకంగా నిలుస్తోంది. తండ్రి శక్తి కపూర్ , తల్లి శివాంగి కపూర్, సోదరుడు సిద్ధాంత్ కపూర్ పెంపుడు శునకం షైలోతో కలిసి శ్రద్ధా ఈ నివాసంలో ఉంటుండగా దీని విలువ 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
పెద్ద కిటికీల ద్వారా ఇంట్లోకి ప్రసరించే సహజ కాంతి.. తీరప్రాంతపు అందాలను కళ్లకు కట్టేలా తీర్చిదిద్దిన ఓపెన్ లేఅవుట్ అపార్ట్‌మెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మార్బుల్ ఫ్లోరింగ్.. చెక్క హంగులు.. కళాత్మక శిల్పాలు వంటి సంప్రదాయ అంశాలతో పాటు ఆధునిక ఫర్నిచర్ కలయిక ఇంటికి హాయిగా.. ఆత్మీయంగా ఉండే వాతావరణాన్ని ఇస్తుంది. లివింగ్ రూమ్‌లోని కుటుంబ ఫోటోలు.. అవార్డుల ప్రదర్శనలతో పాటు మొక్కలు, పక్షుల ఫీడర్లతో కూడిన గ్రీన్ కార్నర్ శ్రద్ధా ప్రకృతి ప్రేమను ప్రతిబింబిస్తోంది.
1987లో శక్తి కపూర్ ఈ భవనంలో 7 లక్షలకు త్రీ-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా కాలక్రమేణా మరిన్ని భాగాలను కలుపుతూ మొత్తం అంతస్తును కపూర్ కుటుంబం సొంతం చేసుకుంది. సినిమాల విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ నటించిన బయోపిక్ చిత్రం `ఈథా` డిసెంబర్ 4 విడుదలకు సిద్ధమవుతోంది.
















































