సౌత్ ఇండస్ట్రీలో ఫ్రాంచైజీల ట్రెండ్ !
Sequels are proving to be a major box-office force for South Indian cinema
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫ్రాంచైజీల ట్రెండ్ నయా రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లకే పరిమితమైన సీజన్లు, పార్టుల సంస్కృతి ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై భారీ స్థాయిలో వర్కవుట్ అవుతోంది. ఒక కథను ఒకే సినిమాలో పూర్తి చేయకుండా విస్తృతమైన కన్వాస్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులలో కథపై ఉన్న ఆసక్తిని, పాత్రల ప్రభావం వల్ల వచ్చే హైప్‌ను తదుపరి భాగాలకు క్యాష్ చేసుకోవడంలో సౌత్ ఫిల్మ్ మేకర్స్ పక్కా ప్రణాళికతో విజయం సాధిస్తున్నారు.
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు పార్ట్-1 తో సాధించిన అపూర్వ విజయం సీక్వెల్స్ సంస్కృతికి బలమైన పునాది వేసింది. బాహుబలి బిగినింగ్ ఇచ్చిన హైప్ `బాహుబలి 2`ని ఏ రేంజ్‌లో నిలబెట్టిందో? `కేజీఎఫ్ చాప్టర్ వన్` ఇచ్చిన మాస్ ఊపు `కేజీఎఫ్ ఛాప్టర్ 2`ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా చేసింది. ఇదే క్రమంలో `పుష్ప 2` కూడా మార్కెట్లో అంచనాలను పెంచేసింది. ఈ గ్రాండ్ సక్సెస్ ఫార్ములాను చూసిన తర్వాత మేకర్స్ కథలను ఒక పార్ట్‌తో ఆపకుండా ఏకంగా `కేజీఎఫ్ 3`, `పుష్ప 3` వంటి మూడో భాగాల వైపు కూడా అడుగులు వేయిస్తున్నారు.
పాన్-ఇండియా యాక్షన్ సినిమాలే కాకుండా విభిన్నమైన జోనర్లలో కూడా ఈ ఫ్రాంచైజీ ట్రెండ్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన మోహన్‌లాల్ `దృశ్యం` ఫ్రాంచైజీ ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తాజాగా `దృశ్యం 4` పై కూడా అంచనాలు నెలకొన్నాయి. అలాగే కన్నడ డివైన్ థ్రిల్లర్ `కాంతార` కూడా ప్రీక్వెల్‌తో పాటు తదుపరి భాగాలకు ద్వారాలు తెరిచింది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ మేనియాతో వచ్చిన `జైలర్` చిత్రం కూడా `జైలర్ 2`, `జైలర్ 3` స్థాయి వరకు ఫ్రాంచైజీగా రూపాంతరం చెందుతుండటం ఈ ట్రెండ్‌కు నిదర్శనం.
మొత్తానికి సౌత్ ఇండస్ట్రీలో ఫ్రాంచైజీల ట్రెండ్ అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే కాకుండా వ్యాపార రీత్యా కూడా సురక్షితమైన మార్గంగా మారింది. ఒక పాపులర్ క్యారెక్టర్ లేదా వరల్డ్ డిజైన్‌ను ప్రేక్షకులు ఆదరించినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై విభిన్నమైన కథనంతో చూపించడం వల్ల బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈసీక్వెల్స్, ప్రీక్వెల్స్ ట్రెండ్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లతో సౌత్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
















































