సినిమాపై మీ ప్రేమే నాకెప్పుడూ స్ఫూర్తి!

Amitabh Bachchan Birthday SpecialAmitabh Bachchan Birthday Special

బాలీవుడ్ లెజెండరీ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్  84వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య దైవమైన అమితాబ్ బచ్చన్‌కు అత్యంత ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ సోషల్ మీడియా వేదికగా  ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. అమితాబ్‌ను తన గురూజీగా సంబోధిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్  అభిమానుల్ని ఆక‌ట్టుక‌లుంటుంది.`నా అత్యంత ప్రియమైన గురూజీ అమితాబ్ బచ్చన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాపై మీకున్న అంతులేని ప్రేమ, మీరు మీ కళ పట్ల చూపించే గౌరవం ఎప్పుడూ నాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి` అంటూ చిరంజీవి  హృదయపూర్వక భావాలను పంచుకున్నారు.

అమితాబ్ అసాధారణ విజయాలే కాకుండా అమితాబ్ వ్యక్తిగతంగా చూపించే ఆప్యాయత, వినయపూర్వక స్వభావం ఆయన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయని చిరంజీవి కొనియాడారు. అమితాబ్ కు మంచి ఆరోగ్యం, అంతులేని సంతోషం కలగాలని, తాను ప్రేమించే కళా సేవను మరింత కాలం కొనసాగించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌ను ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్న అరుదైన ఫోటోను కూడా పంచుకున్నారు. ఈ చిత్రం ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న అచంచలమైన స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇరు పరిశ్రమల అభిమానులు దిగ్గజ ద్వయానికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చిరంజీవి  కెరీర్‌లో అమితాబ్ బచ్చన్‌ను ఎప్పుడూ నిజమైన గురువుగా, భారతీయ సినిమా నిజమైన మెగాస్టార్‌గా భావిస్తూ వస్తున్నారు. 2019లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం `సైరా నరసింహా రెడ్డి` చిత్రంలో చిరంజీవికి గురువు పాత్ర అయిన గోసాయి వెంకన్న పాత్రలో నటించాల్సిందిగా అమితాబ్‌ను కోరడానికి చిరంజీవి ఎంతో సంకోచించినా? ఆ బంధంపై గౌరవంతో అమితాబ్ వెంటనే ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు.

ఆ చిత్రంలో నటించినందుకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా, ప్రైవేట్ జెట్ ఆఫర్‌ను కూడా తిరస్కరించి సొంతంగా ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేసుకుని మరీ అమితాబ్ బచ్చన్ ఆ సినిమాకు పనిచేశారు. చిరంజీవిపై ఉన్న స్నేహం, ఆప్యాయత కారణంగా ఆయన చూపిన  గొప్ప మనసు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరువలేనిదిగా నిలిచిపోయింది. నేడు అమితాబ్ 84వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఈ మధుర జ్ఞాపకాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Happy Birthday to Amitabh Bachchan