నవరాత్రి విశేషాలపై మనసు విప్పి న‌ వాణీ కపూర్!

Vaani Kapoor Celebrates NavratriVaani Kapoor Celebrates Navratri

బాలీవుడ్ నటి వాణీ కపూర్ నవరాత్రి పండుగను సాంప్రదాయం, కుటుంబం ,స్త్రీ శక్తిలోని వివిధ రూపాల వేడుకగా అభివర్ణించారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన వాణీ ముంబైకి మారిన తర్వాత రెండు నగరాల్లోనూ ఈ పండుగను వేర్వేరు రీతుల్లో అనుభవించినట్లు తెలిపారు. ఢిల్లీలో రామ్‌లీలాలు, మార్కెట్ల సందడి, ఇంట్లో అష్టమి పూజల సమయంలో హల్వా, పూరీ, చనాలతో పాటు `కంజక్` కోసం వచ్చే చిన్న పిల్లలతో గడిపిన తీపి జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ముంబైలో గర్బా, దాండియా డ్యాన్సులు, సంగీతంతో కూడిన ఉత్సాహభరితమైన వాతావరణం  ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.

నవరాత్రి పండుగ వేళ దేవీ రూపాలను, స్త్రీ శక్తిని ఆరాధించడం ఎంతో అందమైన విషయమని చెబుతూనే సమాజంలో మహిళల పట్ల ప్రదర్శించే గౌరవం కేవలం పండుగలకే పరిమితం కాకూడదని వాణీ అభిప్రాయపడ్డారు. సమాజంలో చాలామంది మహిళలు నిరంతరం సర్దుకుపోవాలని, ఇతరుల కోసం త్యాగాలు చేయాలని ఒత్తిడికి గురవుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొనే కష్టాలను, వారి సహనాన్ని మెచ్చుకోవడమే కాకుండా, అసలు వారు ఎందుకు అంతగా భరించాల్సి వస్తోందో ఆలోచించాలని అన్నారు. స్వయం నిర్ణయాధికారం, ఆర్థిక స్వతంత్రత, రక్షణ  తమ కలలను నెరవేర్చుకునే స్వేచ్ఛ ప్రతి మహిళకూ దక్కాలని  స్పష్టం చేశారు.

నవరాత్రి పండుగ వేళ తరాల అంతరం లేకుండా మహిళలందరూ కలిసి సంబరాలు చేసుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని వాణీ కపూర్ అన్నారు. రోజువారీ బాధ్యతల ఒత్తిడిలో మహిళలు తమ ఆనందాన్ని మర్చిపోతుంటారని.. ఇలాంటి పండుగల సమయంలో అందరితో కలిసి సంతోషంగా గడపడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. స్త్రీ రూపాన్ని ఎన్నో విధాలుగా గౌరవించుకునే నవరాత్రి పండుగ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కుటుంబాలను, మనుషులను ఒకచోటకు చేర్చే అద్భుతమైన మార్గమని  ముగించారు.

Vaani Kapoor on why Navratri in Delhi will always feel nostalgic