బిగ్ బీ మృత్యువును జయించిన అరుదైన కథ!
When Amitabh Bachchan was declared clinically dead
1982 జూలై 26న బెంగళూరు యూనివర్సిటీలో మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్న `కూలీ` సినిమా చిత్రీకరణ సమయంలో అమితాబ్ బచ్చన్‌కు ఘోర ప్రమాదం జరిగింది. తోటి నటుడు పునీత్ ఇస్సార్‌తో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు స్టంట్ డూప్ లేకుండా స్వయంగా నటించాలని అమితాబ్ నిర్ణయించుకున్నారు. అయితే టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో ఫైట్ సమయంలో ఒక టేబుల్ మూల అమితాబ్ పొట్ట భాగంలో తీవ్రంగా గుచ్చుకుంది. ఈ ప్రభావంతో ఆయన పేగులు తెగిపోయి తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో ఆయన్ని బెంగళూరు నుండి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తలెత్తిన కాంప్లికేషన్స్ వల్ల అమితాబ్ రక్తపోటు పడిపోయి కోమా వంటి స్థితిలోకి జారుకున్నారు. వైద్యపరంగా అమితాబ్ ని కొన్ని క్షణాల పాటు క్లినికల్లీ డెడ్ (మరణించినట్లు)గా ప్రకటించారు. ఆ క్లిష్ట సమయంలో అమితాబ్ భార్య జయా బచ్చన్ ధైర్యం కోల్పోకుండా హనుమాన్ చాలీసా పఠిస్తూ అమితాబ్ మంచం పక్కనే ఉన్నారు. వైద్యులు అమితాబ్ ని పునరుద్ధరించడానికి శ్రమిస్తున్న సమయంలో అమితాబ్ కాలి వేలు కదలడాన్ని జయా బచ్చన్ గమనించి ఆయన కదులుతున్నారు అని గట్టిగా అరిచారు. దీంతో వైద్యులు వెంటనే పునరుజ్జీవన ప్రయత్నాలు తీవ్రం చేయగా అమితాబ్ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించారు.
అమితాబ్ ప్రమాద వార్త తెలియగానే దేశవ్యాప్తంగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యావత్ భారతదేశం ప్రాణాపాయం నుండి బయటపడాలని ఏకమై ప్రార్థనలు చేసింది. అభిమానులు ఆసుపత్రి ముందు గుమిగూడడం, ఉపవాసాలు ఉండడం, గుళ్లకు నడకదారిన వెళ్లి పూజలు చేయడం వంటివి చేశారు. ఆ సమయంలో అమితాబ్ లైవ్స్ అనే నినాదం దేశమంతటా మార్మోగింది. ఆ తర్వాత 1983లో విడుదలైన `కూలీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అమితాబ్‌కు ప్రమాదం జరిగిన కచ్చితమైన ఫైట్ సీన్‌ను చిత్రంలో అలాగే ఉంచి అక్కడ ప్రత్యేకమైన నోట్‌ను కూడా ప్రదర్శించారు.
















































