పెయిడ్ ప్రీమియర్స్: వరమా? శాపమా?

Paid PremieresPaid Premieres

ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన పెయిడ్ ప్రీమియర్స్  విధానం చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా నిర్మాతలకు అనేక మార్పులను తీసుకువస్తోంది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందుగానే ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేక షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ ప్రీమియర్‌లను తీసుకొస్తున్నారు. ఈ ట్రెండ్ సినిమాలకు శ్రేయస్కరమా కాదా అనే అంశంపై చిత్రసీమలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఉండే లాభనష్టాలను పరిశీలిస్తే కొన్ని కీలక విషయాలు స్పష్టమవుతాయి.  

పెయిడ్ ప్రీమియర్స్ వల్ల చిత్ర యూనిట్‌కు ముందస్తుగా పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా కంటెంట్ గట్టిగా ఉండి, కథలో దమ్ముంటే ప్రీమియర్ షో పడిన క్షణాల నుంచే మౌత్ టాక్  వేగంగా సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తుంది. దీనివల్ల సాధారణ విడుదల రోజునే కలెక్షన్ల సునామీ సృష్టించడానికి  బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. 

సినిమాకి తొలి రోజే రావలసిన అడ్వాన్స్ కలెక్షన్స్ , ప్రీమియర్ వసూళ్ల ద్వారా నిర్మాతలకు కొంత ఆర్థిక భరోసా దక్కుతుంది. సినిమా పట్ల ఆసక్తి ఉన్న డైరెక్ట్ ఆడియన్స్, సినీ ప్రేమికులు టికెట్ రేట్లు ఎక్కువైనా సరే ముందే సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఇది సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్లలో కూడా నమ్మకాన్ని ఇస్తుంది.  

కంటెంట్ పరంగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే, రెగ్యులర్ షోలు పడేలోపు వాటిని సరిదిద్దుకునే వెసులుబాటు మేకర్స్‌కు లభిస్తుంది. కొన్నిసార్లు నిడివి ఎక్కువగా ఉండటం లేదా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు మైనస్‌‌గా అనిపిస్తే మార్నింగ్ షో పడేలోపు ఎడిటింగ్ ట్రిమ్మింగ్స్ చేసుకునేందుకు ఈ ప్రీమియర్ టాక్ ఒక అద్దంలా ఉపయోగపడుతుంది.  

మ‌రోవైపు ఈ విధానం వల్ల తీవ్రమైన నష్టాలు ఉండే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమా ఫలితంపై కొంచెం తేడా ఉన్నా లేదా టాక్ యావరేజ్ లేదా డిజాస్టర్ అని మొదటి షోకే బయటికి వచ్చినా ఆ ప్రభావం వెంటనే తర్వాతి షోలపై పడుతుంది. రెగ్యులర్ మార్నింగ్ షో పడకముందే సినిమా రిజల్ట్ తేలిపోవడంతో, అసలు కలెక్షన్లు రాకముందే ఆ చిత్రం పూర్తిగా వాష్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది.  పెయిడ్ ప్రీమియర్స్ వల్ల పైరసీ భూతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రీమియర్ షో సమయంలో థియేటర్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ..ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్లు ప్రత్యక్షం కావడం జరుగుతోంది. ఇది సినిమా తొలి రోజు కలెక్షన్లపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా ఓపెనింగ్ వీకెండ్‌పై ఇది కోలుకోలేని దెబ్బ తీస్తుంది.  అంతే కాదు సినిమాకు నెగటివ్ టాక్ వస్తే  గంటల వ్యవధిలోనే ఆ ప్రభావం నైట్స్ ,  వీకెండ్ బుకింగ్స్‌పై పడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆర్థిక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు సినిమా బాగుందనే వార్త ప్రేక్షకులకు చేరేందుకు కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు ప్రీమియర్స్ కారణంగా ఆయువు గడువు చాలా తక్కువైపోయింది.   మొత్తంగా  పెయిడ్ ప్రీమియర్స్ అనేది ద్విముఖ అస్త్రం లాంటిది. కంటెంట్ నమ్ముకున్న సినిమాలకు ఇది ఒక పెద్ద వరంలా పనిచేసి రికార్డు కలెక్షన్‌లను తెచ్చిపెడితే.. అంచనాలు అందుకోలేని చిత్రాలకు మాత్రం ఇది కోలుకోలేని శాపంగా మారుతుంది. దీంతో సినిమా ఫ‌లితంపై  పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే నిర్మాతలు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.   

Paid Premieres