33 సినిమాల కెరీర్‌లో ఇదే తొలిసారి
Nani on The Paradise Public Talkనేచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల్ కాంబినేషన్ రిలీజ్ అయిన `ది ప్యారడైజ్` చిత్రంపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ ఈ సినిమాకు వస్తున్న స్పందనపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 18 ఏళ్ల సినీ ప్రయాణంలో 33 సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి కొత్త అనుభవాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని నాని వ్యాఖ్యానించారు.
ప్రేక్షకుల నుండి వస్తున్న ప్రతికూల విమర్శలను అగ్రెసివ్ ఆనెస్టీ గా అభివర్ణించారు. `ఈ సినిమా నాకు నచ్చలేదు అని తీవ్రమైన భావోద్వేగంతో చెబుతున్నారంటే? తమ కాంబినేషన్‌పై ప్రేక్షకులకు ఉన్న ఆరాటం, చూపించే ప్రేమే కారణమని స్పష్టం చేశారు. గతంలో `దసరా` చిత్రంతో విజయాన్ని అందించిన తమ జట్టుపై వీక్షకులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. అందుకే వారి నుంచి తీవ్రమైన స్పందన వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం కోసం తాము ఎంతగానో శ్రమించామని, ఏ సన్నివేశాన్ని కూడా అరకొరగా చేయలేదని నాని తెలిపారు. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని, శ్రీకాంత్ ఒదెలతో చేసే తదుపరి ప్రాజెక్ట్‌ను మరింత పెద్ద విజయం సాధించేలా రూపుదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.















































