మానవీయ సంక్షోభంలో మౌనం సరైనదేనా?
Singer Ed Sheeranపాప్ సంగీత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు ఎడ్ షీరన్ లూప్ మ్యూజిక్ టూర్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ టూర్ ప్రదర్శనల్లో భాగమైన రాప్ ఆర్టిస్ట్ మెక్లెమోర్ వేదికపై `ఫ్రీ పాలస్తీనా` అని నినదించడంతో ఆయన్ని టూర్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఇతర సహ కళాకారులు కూడా ప్రదర్శనల నుంచి తప్పుకోవడంతో, అంతర్జాతీయంగా సంగీత ప్రియులు , విమర్శకుల దృష్టి ఈ వివాదంపై పడింది.
ఈ వివాదంపై ఎడ్ షీరన్ స్పందించారు. మెక్‌లెమోర్‌ను తొలగించే నిర్ణయం స్టేడియం యజమానులు మరియు ప్రమోటర్లదే తప్ప తనది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను ఎల్లప్పుడూ రాజకీయ రహితం గానే ఉంటానని, తన సంగీతం ప్రజలకు వినోదాన్ని అందించడానికే ఉద్దేశించినదని తెలిపారు. తాను ఎవరికీ రాజకీయాలు నేర్పించబోనని.. వ్యక్తిగతంగా ఓటు వేస్తాను తప్ప వేదికలపై రాజకీయ అభిప్రాయాలను రుద్దనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఎడ్ షీరన్ తీసుకున్న రాజకీయ రహిత వైఖరిపై నైతిక శాస్త్రవేత్తలు - సామాజిక విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన బ్రెక్సిట్ వ్యతిరేక ప్రచారాలకు, వర్ణవివక్ష రహిత పోరాటాలకు బహిరంగంగా మద్దతు తెలిపారు. అలాగే 2022లో ఉక్రెయిన్‌కు సహాయార్థం నిర్వహించిన సంగీత కచేరీలో కూడా పాల్గొన్నారు. ఇలాంటి అంశాలపై స్పష్టమైన రాజకీయ నిర్ణయాలు తీసుకున్న షీరన్, కేవలం పాలస్తీనా సంక్షోభం విషయానికొచ్చేసరికి తటస్థంగా ఉంటానని చెప్పడం ఆయన వైఖరిలోని ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపుతోందని విమర్శిస్తున్నారు.
















































