దావూద్ ఇబ్రహీంతో మందాకిని ఫోటో వివాదంపై క్లారిటీ!
I was not invited by Dawood: Mandakiniబాలీవుడ్ సీనియర్ నటి మందాకిని గతంలో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న వైరల్ ఫోటో వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మందాకిని ఆ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాలను వివరించారు. దుబాయ్‌కి తానెప్పుడూ దావూద్ ఆహ్వానం మేరకు వెళ్లలేదని.. ఒక ప్రదర్శన (షో) కోసం మాత్రమే అక్కడకు వెళ్లానని స్పష్టం చేశారు. ఒక కళాకారిణిగా ఎంతోమంది ప్రజలను కలవడం సాధారణ విషయమని మందాకిని తెలిపారు.
తానొక షో కోసం దుబాయ్ వెళ్లిన సమయంలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లానని, అక్కడ చాలామంది ప్రజలతో పాటు ఆ ఫోటో తీయడం జరిగిందన్నారు. ఆర్టిస్ట్‌కు అందరూ సమానమేనని, ఎవరిని కలవాలో? ఎవరిని కలవకూడదో? ఎంచుకునే అవకాశం తమకు ఉండదని పేర్కొన్నారు.
ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత తెరపైకి వచ్చిన ఊహాగానాలు, వార్తలపై తమకేమీ నియంత్రణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది రాయాలనుకుంటే అది రాశారని.. ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఆ తీవ్రతను గ్రహించలేకపోయామని.. కానీ ఆ వివాదం తన నటనా జీవితాన్ని దెబ్బతీసిందని మందాకిని వెల్లడించారు.
ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు పబ్లిక్ రిలేషన్స్ నిర్వహణ కోసం నటులకు ఒక సొంత బృందం ఉండటం ఎంత అవసరమో తర్వాత అర్థమైందన్నారు. ఎప్పటికప్పుడు ఆ రూమర్లను ఖండిస్తూనే వచ్చానని.. కానీ ఆ వివాదం కెరీర్‌పై పడేసిన ప్రతికూల ప్రభావాన్ని నివారించలేకపోయిందని పేర్కొన్నారు. దర్శకుడు రాజ్ కపూర్ తెరకెక్కించిన `రామ్ తేరీ గంగా మైలీ` (1985) చిత్రంతో మందాకిని 16 సంవత్సరాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు.
















































