రామ-రావణుల ప్రచార యుద్దం!
Ranbir, Yash to lead special fan events for Ramayanaఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ: పార్ట్ 1` విడుదల తేది సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పాన్-ఇండియా స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్న మేకర్స్ అభిమానులను నేరుగా కలిసేందుకు ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కలిసి ఢిల్లీ , బెంగళూరు నగరాలలో నిర్వహించే భారీ ఫ్యాన్ మీట్స్‌లో సందడి చేయనున్నారు.
భారీ ప్రాజెక్టును నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విభిన్న భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ నటిస్తున్న చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనుండటంతో సినీ వర్గాల్లో .. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే వేదికపై ప్రమోషన్స్ కోసం కలవడం సినిమాపై హైప్‌ను మరింత రెట్టింపు చేస్తోంది.
ఈ ప్రచార యాత్ర తో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా సాంకేతిక ప్రమాణాలను, విజువల్ వండర్స్‌ను పంచుకోవడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రణ్‌బీర్ , యశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవంబర్ మొదటి వారంలో రాబోతున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.







































