ఫెడరేషన్‌పై డ్యాన్స్ మాస్టార్ తిరుగుబాటు
Raghu Master Takes Over Dancers Unionతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF), డాన్సర్స్ అసోసియేషన్ నడుమ రగులుతున్న వివాదం ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎటువంటి చట్టబద్ధమైన నోటీసులు జారీ చేయకుండా.. కేవలం వ్యక్తిగత కక్షలతో తమపై సహాయ నిరాకరణ విధించడాన్ని డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత (జానీ మాస్టర్ సతీమణి) తీవ్రంగా ఖండించారు.
గతంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన వ్యక్తులతో ఫెడరేషన్ అక్రమంగా అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసిందని..ఇలాంటి చెల్లుబాటు కాని కమిటీలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేశారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ యూనియన్‌ను రెండు ముక్కలుగా విభజించేందుకు కుట్రలు పన్నుతున్న వారికి `నడిరోడ్డుపై నిలబెట్టి కొడతాం` అంటూ ఆమె అత్యంత ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.
స్వప్రయోజనాలు, అభద్రతా భావంతో ఫెడరేషన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల మిగతా 23 క్రాఫ్ట్ అసోసియేషన్ల ఉనికికి కూడా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని డాన్సర్స్ అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన తమ పాలకవర్గాన్ని తొక్కేయాలని చూస్తే, తాము కూడా సమాంతరంగా నాలుగు కొత్త యూనియన్లను స్థాపించి ఫెడరేషన్‌కే సహాయ నిరాకరణ చేయగలమని సవాల్ విసిరారు.
ఫెడరేషన్ తీరును ఎండగడుతూ ఇప్పటికే ప్రభుత్వ కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్‌మెంట్) పర్యవేక్షణలోనే పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ సాధించుకున్నామని వెల్లడించారు. పరిశ్రమలోని నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకుండా కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని వారు తేల్చి చెప్పారు.







































