సీతమ్మ పై నిప్పులు చెరుగుతోన్న జనాలు!
Kriti Sanon's Raksha Bandhan Ad Sparks Debate
బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా నటించిన ఓ ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో ఓ జ్యువెల్లరీ బ్రాండ్ కోసం ఆమె చేసిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ప్రకటనలో కృతి సనన్ ధరించిన దుస్తులపై నెటిజన్ల మధ్య భిన్న వాదనలు వ్యక్తమ వుతున్నాయి.సాంప్రదాయ పండుగైన రాఖీ వేడుకను హైలైట్ చేస్తూ రూపొందించిన యాడ్‌లో కృతి సనన్ తోడబుట్టినవాడికి రాఖీ కట్టే సన్నివేశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఆమె ధరించిన ఇండో-వెస్ట్రన్ దుస్తులు, ముఖ్యంగా బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్ , డ్రాప్డ్ స్కర్ట్ సాంప్రదాయ పండుగకు తగినట్లుగా లేవంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ప్రకటన విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. పండుగ రోజుల్లో మహిళలు ఇలాంటి మోడ్రన్ దుస్తులు ధరించడం ఏంటని కొందరు మండిపడ్డారు. అసలు పూజా థాలీ ఎక్కడ ఉంది? రాఖీ పండుగకు ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటి? అని కొందరు విమర్శలు గుప్పిస్తూ బ్రాండ్‌ను, నటిని టార్గెట్ చేశారు.
మరోవైపు కృతి సనన్‌కు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో స్పందన వస్తోంది. నటిని విమర్శిస్తున్న వారిపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ఆమె గ్లామరస్ పాత్రలను, బికినీ దృశ్యాలను ఆస్వాదించే వారే ఇప్పుడు ఇలాంటి దుస్తులపై అనవసరమైన నైతిక నిబంధనలు విధిస్తున్నారంటూ మద్దతుదారులు విమర్శించారు.
మహిళలు ఏ సందర్భంలో ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై సమాజంలో ఇప్పటికీ కొన్ని నిర్దిష్టమైన అంచనాలు ఉన్నాయని యాడ్ ఆ మూస పద్ధతులను బద్దలు కొట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పండుగలకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలనే కట్టుబాట్లను ఇది ప్రశ్నిస్తోందని, కృతి సనన్‌ను ట్రోల్ చేయడం సరికాదని సమర్థిస్తున్నారు.
















































