సౌత్ స్టార్స్ సెకండ్ హోమ్ ముంబై!
South Stars Mumbai Homes
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా కల్చర్ జోరు అందుకున్న తర్వాత సినిమాలే కాకుండా నటీ నటుల జీవన శైలి .. నివాసాలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని వేర్వేరుగా ఉన్న పరిశ్రమలు ఒక్కటే కావడంతో దక్షిణాది స్టార్ హీరోలందరూ ముంబై నగరాన్నిసెకండ్ హోమ్) మలుచుకుంటున్నారు. హిందీ మార్కెట్‌ను ఏకకాలంలో శాసించడంతో పాటు, అక్కడి షూటింగ్‌లు .. బిజినెస్ మీటింగ్‌లను సులభతరం చేసుకోవడానికి ముంబైలో విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేస్తున్నారు.
ఈ జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ముందు వరుసలో ఉన్నారు. `కేజీఎఫ్` విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం `టాక్సిక్`, `రామాయణ` వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన ఆలీభాగ్ ఏరియాలో 24 కోట్ల రూపాయల భారీ వ్యయంతో సముద్రపు అందాలు కనిపించే అద్భుతమైన బీచ్ వ్యూ ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ లోఖండ్వాలాలో 150 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాను కలిగి ఉండగా, స్టార్ హీరో సూర్య దంపతులు ముంబైలో 70 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌ను తమ హాలిడే స్పాట్‌గా మార్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు సైతం ముంబైలో స్థావరాన్ని ఏర్పరచుకోవడంలో వెనుకడుగు వేయలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2021లోనే కార్ ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో 30 కోట్ల రూపాయలతో లగ్జరీ పెంట్ హౌస్‌ను తీసుకున్నారు. పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌కు కూడా ముంబైలో ప్రత్యేకంగా విలా సవంతమైన నివాసం ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా ప్రాజెక్ట్ `రాకా` షూటింగ్ ఇతర పనుల నిమిత్తం ముంబైలోని జూహు ఏరియాలో సీ-వ్యూ ఉన్న 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను భారీ అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు.
హీరోలే కాకుండా నటీమణులు సమంత, రష్మిక మందన్నలతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కూడా ముంబై బాంద్రా ప్రాంతంలో 38 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసి తమ హవాను చాటుకుంటున్నారు. ఇలా సౌత్ స్టార్స్ అందరూ ముంబైని తమ ప్రధాన కార్యాలయంగా మార్చుకోవడం చూస్తుంటే? రాబోయే రోజుల్లో బాలీవుడ్ .. సౌత్ సినిమా మధ్య ఉన్న సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవడం ఖాయమని తెలుస్తోంది.
















































