ఆదిత్య ధర్ చేతికి సంచలన బయోపిక్ బాధ్యతలు!
Aditya Dhar in talks to direct Lachit Borphukan biopic
ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోంది. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన గొప్ప యోధులను, దేశభక్తులను నేటి తరానికి పరిచయం చేయడంలో దర్శకులు ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో `ధురంధర్` తర్వాత ఆదిద్య ధర్ ఏ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల ఆదిత్య ధర్‌ను కలిసి అస్సాం వీర పుత్రుడు లచిత్ బోర్ఫుకాన్ జీవిత చరిత్రపై సినిమాను తెరకెక్కించాలని కోరారు.
లచిత్ బోర్ఫుకాన్ అహోమ్ రాజ్యంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఈశాన్య భారతాన్ని కాపాడిన గొప్ప సేనాని. ఆయన త్యాగాలను, పరాక్రమాన్ని నేటి భారతీయులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు ఆదిత్య ధర్ ఈ బయోపిక్ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చారిత్రక చిత్రాలను రూపొందించడంలో ఆదిత్య ధర్‌కు ఉన్న ప్రత్యేక శైలి, యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే విధానం లచిత్ బోర్ఫుకాన్ వంటి వీరుని కథకు ప్రాణం పోయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆయన గత చిత్రాల్లో చూపించిన దేశభక్తి, ఎమోషనల్ కనెక్ట్ , సాంకేతిక ప్రమాణాలు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిలబెట్టగలవు. లచిత్ బోర్ఫుకాన్ జీవితంలోని పోరాటాలను, వ్యూహాలను తెరపై చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభమైన పని కాదు. చారిత్రక ఆధారాలను, వాస్తవాలను వక్రీకరించకుండా అదే సమయంలో ప్రేక్షకులను అలరించే కథనంతో సినిమాను రూపొందించడం సవాలుతో కూడుకున్నది. గతంలో వచ్చిన కొన్ని చారిత్రక చిత్రాలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో ఈ చిత్ర బృందం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కథా రచనలో , స్క్రీన్‌ప్లేలో జాగ్రత్తలు తీసుకుంటే ఇది మరో క్లాసిక్‌గా నిలుస్తుంది.







































