RFC లో ప్ర‌మాద‌క‌ర కీట‌కం?

A dangerous insect in RFC?

 

ప్ర‌ముఖ బాలీవుడ్  నటుడు రాజేష్ శర్మ ప్రభాస్ హీరోగా న‌టిస్తోన్న‌`ఫౌజీ` షూటింగ్ సెట్స్‌లో కీటకం కాటుకు గురైన ఘటన  టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన రాజేష్ శర్మ అక్కడి దట్టమైన వృక్షసంపద ఉన్న ప్రాంతంలో ప్రమాదవశాత్తూ విషపూరితమైన కీటకం కాటుకు గురయ్యారు. తొలుత పరిస్థితిని గమనించని ఆయన ఆ తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతూ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.

ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే?  నటుడి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యుల తరపున విడుదలైన వైద్య ప్రకటన  గంటల వ్యవధిలోనే సోషల్ మీడియా నుండి మాయమవ్వడం. ఈ అకస్మాత్ తొలగింపు వెనుక ఏదైనా?  ఒత్తిడి ఉందా లేదా విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా?  అనే అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. నటుడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడం ఆయన అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఘటనపై సినీ కార్మిక సంఘాలు (AICWA) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. షూటింగ్ సెట్స్‌లో కనీస భద్రత, పరిశుభ్రత , అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలో చిత్రబృందం, ఫిలిం సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించాయని  తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలాంటి  ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. సెట్స్‌లో రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల  నటుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం క్షమించరానిదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

దీనిపై పూర్తిస్థాయిలో స్పందించిన ఏఐసీడ‌బ్ల్యూఏ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. రామోజీ ఫిలిం సిటీలో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించాలని వారు కోరారు. అలాగే  రాజేష్ శర్మ పూర్తిగా కోలుకునే వరకు ఆయన వైద్య ఖర్చులన్నీ నిర్మాణ సంస్థే భరించాలని  స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో పనిచేసే కళాకారులు ,  సిబ్బందికి భద్రత కల్పించాల్సిన బాధ్యతపై ఈ ఘటన మరోసారి చర్చను లేవనెత్తింది. ఈ నేప‌థ్యంలో  రామోజీ ఫిలిం సిటీలో ఉన్న  ప్ర‌మాద‌క‌ర కీట‌కం ఏంటి? అన్న దానిపై నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. దీంతో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోన్న మిగ‌తా చిత్ర యూనిట్లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. భారీ పొద‌లు ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే ఒళికిపోతున్నారు. 

Ramoji Film City