అందాల తారను సైతం వదలని బాడీ షేమింగ్!
Madhuri Dixit recalls being body-shamed when she entered the industry
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటన, నృత్యం తో దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన ధృవతార మాధురీ దీక్షిత్. నేడు బాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీగా, నటనకు నిఘంటువుగా వెలుగొందుతున్న మాధురీ కూడా కెరీర్ ఆరంభంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని వెల్లడించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కెరీర్ తొలినాళ్లలో శారీరక రూపాన్ని బట్టి తీర్పునిచ్చేవారని తాను మరీ సన్నగా ఉన్నాను అనే కారణంతో ఎన్నో ఆఫర్లు చేజారాయని గుర్తుచేసుకున్నారు. ఆ కాలంలో కథానాయికలు కాస్త బొద్దుగా ఉండాలనే సాంప్రదాయ ధోరణి బలంగా ఉండటంతో చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు మాధురీని హీరోయిన్‌గా అంగీకరించలేదన్నారు.
రూపంపై వచ్చిన విమర్శలు మనస్తాపానికి గురి చేసినా? మాధురీ దీక్షిత్ ఎక్కడా అధైర్యపడకుండా తన ప్రతిభ.. అంకితభావంపైనే నమ్మకం ఉంచారు. ఆ తర్వాత `తేజాబ్`, `దిల్`, `బేటా`, `హం ఆప్కే హై కౌన్` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం.. విమర్శకుల నోళ్లు మూయించారు.
బాలీవుడ్‌లో హీరోయిన్ల అందానికి ఉన్న పాత సౌందర్య ప్రమాణాలను పూర్తిగా మార్చేసింది. బాహ్య సౌందర్యం కంటే నటనా నైపుణ్యం, స్క్రీన్ ప్రెజెన్స్ , ఆత్మవిశ్వాసమే ఒక నటిని స్టార్‌గా నిలబెడతాయని నిరూపించిన మాధురీ దీక్షిత్ ప్రయాణం, నేటి తరం నటీనటులకు బాడీ షేమింగ్‌ను అధిగమించి పరిశ్రమలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్పే ఒక గొప్ప పాఠంగా చెప్పొచ్చు.







































