తనయుడిని లాంచ్ చేసే పనిలో స్టార్ హీరో!
Dhanush To Launch Son Yatra With New Filmతమిళ చిత్ర పరిశ్రమలో ఒక తరం తర్వాత మరో తరం వారసులు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ క్రమంలోనే కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం,వర్సటైల్ యాక్టర్ .. డైరెక్టర్ ధనుష్ తన పెద్ద కుమారుడు యాత్రను కథానాయకుడిగా పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కుమారుడి వయస్సు 19 ఏళ్లేనని, సినిమా ఎంట్రీపై అప్పుడే నిర్ణయం తీసుకోలేదని ధనుష్ క్లారిటీ ఇచ్చినా? ప్రస్తుత సమీకరణాలు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ధనుష్ స్వయంగా మెగాఫోన్ పట్టి తన ఐదవ దర్శకత్వ ప్రాజెక్ట్‌గా కుమారుడి డెబ్యూ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా `రాయన్` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ధనుష్.. తన కొడుకును లాంచ్ చేసే బాధ్యతను స్వయంగా భుజాన వేసుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు తండ్రి ధనుష్‌కు ఉన్న నేషనల్ వైడ్ క్రేజ్, మేనరిజమ్స్.. మరోవైపు మాతామహుడు (తాతయ్య) సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుగులేని మాస్ లెగసీ.. ఈ రెండు బలమైన బ్యాక్‌గ్రౌండ్స్ యాత్రకు మొదటి సినిమాకే భారీ అడ్వాంటేజ్‌గా మారనున్నాయి. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.







































