ఔరా.. ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పళ్లు!
Meet The Mango Man Of India Who Grows 350 Varietiesఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్‌కు చెందిన 84 ఏళ్ల కలిముల్లా ఖాన్ సాంప్రదాయ విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నా.. కేవలం తన స్వయంకృషితో `మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా`గా అంతర్జాతీయ కీర్తిని గడించారు. ఆయన ఒకే మామిడి చెట్టుకు ఏకంగా 350 రకాల (జాతుల) మామిడి పండ్లను కాసేలా అంటు కట్టాడు. ఏడో తరగతిలోనే చదువు ఆగిపోయిన ఆయన తన తండ్రికి ఉన్న తోటలోనే వ్యవసాయ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
1950వ దశకం నుండి అంటుకట్టే (గ్రాఫ్టింగ్) ప్రక్రియపై పట్టు సాధించిన అతడు తొలినాళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాడు. చివరకు 80లలో తన తోటలోని ఒక 125 ఏళ్ల నాటి పురాతన మామిడి చెట్టుపై ప్రయోగాలు చేసాడు. ఒకే వేరు వ్యవస్థపై ఏకంగా 350కి పైగా విభిన్న రకాల మామిడి పండ్లను పండించి ప్రపంచాన్ని విస్మయపరిచారు. ఈ అద్భుత సృష్టిని వీక్షించేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధకులు నిరంతరం ఆయన క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.
ఒకే కొమ్మపై అల్ఫోన్సో, కేసర్ వంటి పాపులర్ జాతుల పండ్లతో పాటు ఆయన స్వయంగా సృష్టించిన వినూత్న హైబ్రిడ్ మామిడి పండ్లు కాయిస్తున్నాడు. ఈ చెట్టుపై పెరిగే ప్రతి పండు దాని ప్రత్యేక రంగు, రుచి- సువాసనను ఏమాత్రం కోల్పోకుండా సహజ సిద్ధంగా అభివృద్ధి చెందుతుంది.
కలిముల్లా ఖాన్ తన ప్రతిభకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక `పద్మశ్రీ` పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నా.. ఆయన కుమారుడు నాజిముల్లా ఖాన్ ఈ చారిత్రాత్మక వారసత్వాన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అద్భుత తోట కేవలం పండ్ల ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా.. భారతీయ ఆహార సంస్కృతిలో భాగమైన మామిడి జీవవైవిధ్యాన్ని రక్షించే ఒక సజీవ నిధిగా నిలిచింది.








































