ప్రియాంక చోప్రాతో గ్లోబల్ రేంజ్ బిజినెస్

ప్రియాంక చోప్రా స్థాపించిన `అనోమలీ` హెయిర్ కేర్ బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో బ్రాండ్ ఆస్తులు- మేధో సంపత్తిపై రిలయన్స్‌కు పూర్తి హక్కులు వచ్చాయి. 2021లో మొదలైన ఈ బ్రాండ్ వీగన్ ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తూ గుర్తింపు పొందింది. రిలయన్స్ తన `టిరా` ప్లాట్‌ఫారమ్ ద్వారా దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ముఖ్యంగా భారతీయుల హెయిర్ స్వభావానికి తగ్గట్లుగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే రిలయన్స్ ప్రధాన లక్ష్యం.
రిలయన్స్ అండతో ఈ బ్రాండ్ అమెరికా, బ్రిటన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరింతగా విస్తరించనుంది. అంతేకాదు.. బ్రాండ్‌ను విక్రయించినా ప్రియాంక చోప్రా `క్రియేటివ్ డైరెక్టర్`గా తన సేవలను అందిస్తారు. ఉత్పత్తుల నాణ్యత .. బ్రాండ్ విజన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఇషా అంబానీ సారధ్యంలో అనోమలీ బ్రాండ్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాలని రిలయన్స్ పక్కా ప్లాన్ వేసింది. ఈ డీల్ బ్యూటీ మార్కెట్లో రిలయన్స్ ఆధిపత్యాన్ని మరింత పెంచనుంది.








































