టికెట్ రేట్లు పెరగడానికి కారకులు వీళ్లే
Star Salaries, Costly Tickets: Who Is to Blame?
టాలీవుడ్‌లో సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడానికి.. సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరమవడానికి ప్రధాన కారకులు అదుపుతప్పిన పారితోషికాలు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోలు, దర్శకులేననే విశ్లేషణ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. హెల్దీ సినీ పరిశ్రమల్లో బడ్జెట్‌లో 20-25 శాతం మాత్రమే రెమ్యూనరేషన్లకు కేటాయిస్తే.. టాలీవుడ్‌లో మాత్రం సెట్స్ పైకి వెళ్లకముందే 60 నుంచి 75 శాతం సొమ్ము వీరి జేబుల్లోకి వెళ్లిపోతోంది. టైర్-1 స్టార్లు రూ. 70 కోట్ల నుంచి రూ. 200 కోట్లు, మార్కెట్ లేని టైర్-2, సీనియర్ హీరోలు రూ. 25-45 కోట్లు, స్టార్ డైరెక్టర్లు రూ. 30-70 కోట్లు తీసుకుంటుండటంతో ఒక సింపుల్ మూవీకి కూడా నిర్మాత రూ. 150 కోట్లు పెట్టాల్సొస్తోంది. ఈ భారీ పారితోషికాల భారాన్ని తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు, బయ్యర్లు టికెట్ రేట్లను విపరీతంగా పెంచక తప్పడం లేదు.
కేవలం హీరోలు, దర్శకులే కాకుండా.. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసి సినిమా విడుదల కాకముందే టేబుల్ ప్రాఫిట్స్ (ముందస్తు లాభాలు) చూసుకునే కొందరు నిర్మాతలు కూడా ఈ అనారోగ్యకర పరిస్థితికి పరోక్ష కారకులవుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో సింహభాగం స్టార్ల రెమ్యూనరేషన్లకే కరిగిపోతుండటంతో తెరపై కనిపించే నాణ్యత తగ్గడమే కాకుండా.. పెరిగిన టికెట్ ధరల రూపంలో ఆ ఆర్థిక భారం నేరుగా ప్రేక్షకుల నెత్తిన పడుతోంది. 24 శాఖలు బతకాలన్నా, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బాగుండాలన్నా.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాలన్నా హీరో, దర్శకుల పారితోషికాలను బడ్జెట్‌లో 30 శాతం లోపు పరిమితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
















































