వివాదాస్పద వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ!
Sanjay Dutt donot find peace in India
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భారతదేశంలో ప్రశాంతత లోపించిందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన `శేఖర్ టునైట్` కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, `మన దేశ ప్రజలు ఎంతో ఆప్యాయతగలవారు. కానీ ప్రస్తుతం మన దేశంలో ఆ నాటి శాంతి ప్రశాంతతలు నాకు కనిపించడం లేదు. భారతీయులమైన మనం విశాల హృదయం ఉన్నవాళ్లం, ఆ రోజులు మళ్లీ రావాలని శివుడిని ప్రార్థిస్తున్నాను` అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలపై స్పందిస్తూ సంజయ్ దత్ ఎక్స్ వేదికగా స్పష్టతా ప్రకటన విడుదల చేశారు. ఎవరి మనోభావాలను, సమాజాన్ని లేదా వ్యవస్థలను గాయపరచడం కానీ, అవమానించడం కానీ తన ఉద్దేశం కాదన్నారు. ఈ సంభాషణ అంతా ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారం, సరదాగా సాగిన హాస్య సంభాషణ అని, తన మాటలను అసలు సందర్భం నుండి వేరు చేసి విశ్లేషించడం వల్లే ఈ పొరపాటు తలెత్తిందని వివరించారు.
తన వ్యాఖ్యల వెనుక ఉన్న స్ఫూర్తిని వివరిస్తూ ప్రజాదరణ పొందిన `మున్నాభాయ్` సినిమాలలోని `గాంధీగిరి` భావన ఆధారంగానే ఆ సంభాషణ సాగిందని సంజయ్ దత్ తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, ఐక్యత సద్భావాన్ని చాటిచెప్పడమే గాంధీగిరి ముఖ్య ఉద్దేశమని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. అలాగే ప్రధాని పదవికి సంబంధించిన ప్రశ్నపై మున్నాభాయ్ శైలిలో ప్రజల మధ్యనే ఉంటానని చెప్పిన మాటలు కూడా సరదాగా చేసిన వ్యాఖ్యలేనని వెల్లడించారు.
















































