ముంబైకి యామీ గౌతమ్ దంపతులు గుడ్‌బై !
Yami Gautam And Aditya Dhar Plan To Leave Mumbai
యామీ గౌతమ్- ఆదిత్య ధర్ తమ నివాసాన్ని ముంబై నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై మహానగరంలోని నిరంతర రద్దీ, కెమెరాల హడావుడి నుంచి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతోనే దంపతులు తమ శాశ్వత నివాసాన్ని హిమాచల్‌కు మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం వెనుక యామీ గౌతమ్‌కు హిమాచల్ ప్రదేశ్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధమే ప్రధాన కారణం. వివాహానికి ముందే ఆమె హిమాచల్‌లోని మండి జిల్లా గోహర్ ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 100 ఏళ్ల నాటి ఒక పురాతన హేరిటేజ్ ఇంటిని కొనుగోలు చేశారు. రాతి .. చెక్కతో సాంప్రదాయకంగా నిర్మితమైన ఇంటి చుట్టూ సేంద్రీయ వ్యవసాయం, ఆపిల్ తోటలు ఉన్నాయి. జూన్ 2021లో యామీ - ఆదిత్యల వివాహం కూడా అత్యంత నిరాంబరంగా హేరిటేజ్ నివాసంలోనే జరిగింది.
ఇద్దరు వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మే 2024లో జన్మించిన తమ కుమారుడు ప్రైవసీని కాపాడటం, అతనికి ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణాన్ని అందించడం కూడా ఈ మార్పుకు మరో ముఖ్య కారణమని తెలుస్తోంది. అయితే హిమాచల్‌కు మకాం మార్చినంత మాత్రాన వారు సినీ రంగానికి దూరమవుతున్నారని కాదు. ముంబైలోని నివాసాన్ని కేవలం ప్రాజెక్ట్‌లు, షూటింగ్‌లు , ఇతర వృత్తిపరమైన పనుల కోసం ఉపయోగిస్తూ, మిగిలిన సమయాన్నంతా హిమాచల్‌లోని ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని ఈ జంట ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
















































