టాలెంట్ కన్నా పరపతే ముఖ్యమా?
Is influence more important than talent?
టాలీవుడ్ లో ఈ శుక్రవారం నవంబర్ 13న కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి .
ఇట్లు అర్జున - అనీష్ అనే కొత్త హీరో.
మాయా లేడీ - రాకేష్ వర్రే హీరో.
G.O.A.T. - జబర్దస్త్ సుధీర్ హీరో.
దొంగ నా కొడుకు - చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మౌళి హీరో.
అన్ని చిన్న సినిమాలే. అందరూ కొత్త హీరోలవే. కానీ ఒకదానికి టాలీవుడ్ మొత్తం క్యూ లో నిలబడి ఇట్లు అర్జున - అనీష్ కే సపోర్ట్ చేస్తుంది, మిగిలినవి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
ఎందుకు ఈ వివక్ష..
అసలు.. రాకేష్ వర్రే ఎవరో తెలుసా.. బాహుబలి 2 లో ప్రభాస్ చేతిలో తల నరికించుకున్నోడు. మిర్చి, వేదం, గూఢచారి లాంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి, సొంత డబ్బుతో ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమా తీసి హీరో అయినోడు.. 2024 నవంబర్ లో ఆయన జితేందర్ రెడ్డి అనే సినిమా చేసాడు. ఆ సినిమా ప్రెస్ మీట్ లో ఆయన స్టేజ్ మీదే.. బద్దలైపోయాడు..
ఆయన అన్న మాటలు ఇవి..
సెలబ్రెటీలు పిలిచినా రారు సార్, ఒక సెలబ్రెటీ ఉంటేనే అది ఈవెంట్ అవుద్ది, ఒక సెలబ్రెటీ ఉంటేనే అది జనాల్లోకి వెళ్తుంది అనే మైండ్ సెట్ వచ్చేసింది.. "ఎవ్వరికీ చెప్పొద్దు" సినిమాకి స్టేజ్ మొత్తం సెలబ్రెటీలు ఉన్నారు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే సెలబ్రెటీలు కేవలం సపోర్ట్ చేస్తారు, సినిమాని జనాల వరకూ తీసుకెళ్లరు..
తన సినిమా కోసం ఎంతో మందిని పిలిచాడు. ఎవ్వరూ రాలేదు. ఒక్కరు కూడా రాలేదు... ఆ బాధతో స్టేజ్ మీదే ఏడ్చాడు..
ఆ వీడియో వైరల్ అయింది. అందరూ "అయ్యో పాపం" అన్నారు. అంతే. ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు..
ఆ తర్వాత ఇంకో ఈవెంట్ లో దిల్ రాజు.. రాకేష్ వర్రే పేరు తీసుకొని మాట్లాడారు..
ఆయన చెప్పింది ఏంటంటే - "సెలబ్రెటీలు వాళ్ళ బిజీ షెడ్యూల్ లో ఉంటారు.. టైం కుదిరితే వస్తారు... అంతే కానీ రాకపోవడం అంటే సపోర్ట్ చేయకపోవడం కాదు.. మీ టాలెంట్ ని మీరు నమ్ముకోండి. మా లాంటి వాళ్ళ సపోర్ట్ కోసం ఎదురు చూడకండి" అని కుండబద్దలు కొట్టేసారు..
ఆ మాటల్లో తప్పు లేదు.. టాలెంట్ ని నమ్ముకోమని చెప్పడం కరెక్టే..
కానీ ప్రశ్న ఏంటంటే - ఆ టాలెంట్ ని నమ్ముకున్న రాకేష్ కి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు..
తను ఇప్పుడు మాయా లేడీ అనే సినిమాతో నవంబర్ 13న వస్తున్నాడు. సొంతంగా నిర్మాతగా మారి, క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసాడు. ఆ సినిమాకి ఎంత మంది స్టార్ హీరోలు సపోర్ట్.. చేస్తున్నారు,ఒక్కరు కూడా లేరు..
దొంగ నా కొడుకు - చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మౌళి సినిమాకు మైత్రి లో 13నే విడుదల అవుతున్నా.. అంతగా సపోర్ట్ లేదు.
అలాగే జబర్దస్త్ సుధీర్ గురించి అందరికి అందరికి తెలిసిందే..
G.O.A.T. సినిమా గురించి మూడు సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు ఇప్పటికి కుదిరి అదీ నవంబర్ 13నే రిలీజ్..
అదే "ఇట్లు అర్జున" చూడు.. హీరో అనీష్. మొదటి సినిమా, హీరోయిన్ అనస్వర రాజన్. డైరెక్టర్ మహేష్ ఉప్పల, నిర్మాత వెంకీ కుడుముల. నవంబర్ 13నే రిలీజ్..
కానీ ఈ సినిమాకి సపోర్ట్ చూడు -నాగార్జున - టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు , సమర్పకుడిగా మారాడు, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు..
ఎన్టీఆర్ - ట్రైలర్ రిలీజ్ చేసాడు, అనీష్ తో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసాడు.
రామ్ చరణ్, అఖిల్ - నవంబర్ 9న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కి చీఫ్ గెస్టులుగా వచ్చారు.
దిల్ రాజు, మైత్రి రవి లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వెనక ఉన్నారు..
ఒక డెబ్యూ హీరో సినిమాకి సపోర్ట్ చేయటానికి ఇంత మంది టాప్ హీరోలు క్యూ కట్టారు.
రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా? "అనీష్ నా డెబ్యూ కన్నా పది రెట్లు బాగా చేసాడు" అన్నాడు.
అఖిల్ ఏమన్నాడంటే "ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ నా మొదటి సినిమాలో నేను చేయలేకపోయాను" అన్నాడు.
మరి మిగిలిన చిన్న హీరోల సినిమాలకు ఇలా ఒక్కరు కూడా ఎందుకు రాలేదు?
ఇక్కడే అసలు కథ ఉంది..
అనీష్ ఎవరో కాదు, ప్రముఖ బిజినెస్ మ్యాన్, ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేష్ రెడ్డి గారి తనయుడు..
ఆ మహేష్ రెడ్డి గారు ఎవరంటే - నాగార్జున హీరోగా శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి రెండు భక్తి చిత్రాలు తీసిన నిర్మాత. ఇప్పుడు తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నారు..
అంటే.. ఇది టాలెంట్ కోసం వచ్చిన సపోర్ట్ కాదు. ఇది పరపతి కోసం వచ్చిన సపోర్ట్..
మహేష్ రెడ్డి గారికి టాలీవుడ్ లో ఉన్న పరిచయాలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన బిజినెస్ పవర్ - ఇవన్నీ కలిసి ఈ సినిమాకి ఇంత పెద్ద సపోర్ట్ తెచ్చాయి. ఈ సినిమాకి దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టారని ట్రేడ్ లో టాక్. ఒక డెబ్యూ హీరోకి 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు..
ఇక్కడ అనీష్ తప్పు పట్టడం లేదు. తను ఈ చిత్రంలో మూగవాడి పాత్ర చేసాడు...మాటలు లేకుండా నటించడం చాలా కష్టం. అతని టాలెంట్ ని మనం గౌరవించి తీరాలి..
కానీ ఎక్కడ బాధ ఏంటంటే..
ఈ సపోర్ట్ చిన్న హీరోల సినిమాలకు ఎందుకు రావడం లేదు..
చిన్న హీరోల దగ్గర కూడా టాలెంట్ ఉంది.
రాకేష్ వర్రే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకుని వచ్చాడు. సొంత డబ్బుతో సినిమాలు తీస్తున్నాడు." పేక మేడలు"లాంటి మంచి సినిమా తీసాడు.. అయినా ఆయన సినిమాకి ఒక్క సెలబ్రెటీ రాలేదు..
జబర్దస్త్ సుధీర్ హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసాడు. కమిడియన్ గా అతని టైమింగ్ తో పాటు టేలెంట్ ఉన్నవాడే.. కానీ పెద్ద హీరోల సపోర్ట్ లేదు.
అనీష్ దగ్గర టాలెంట్ తో పాటు.. తండ్రి పరపతి ఉంది. అందుకే అందరూ వచ్చారు..
ఇదే టాలీవుడ్ లో అసలు సమస్య, ఇక్కడ టాలెంట్ కన్నా పరపతి ముఖ్యం అయిపోయింది.
దిల్ రాజు అన్నట్టు "మీ టాలెంట్ ని నమ్ముకోండి" అని చెప్పడం ఈజీ.. కానీ టాలెంట్ ఉన్నోడికి ఒక్క ఈవెంట్ కి కూడా స్టార్ రాకపోతే, ఆ టాలెంట్ జనాలకు ఎలా తెలుస్తుంది.
ఎన్టీఆర్, చరణ్, నాగార్జున, అఖిల్ లాంటి వాళ్ళు ఒక్క రోజు వచ్చి, ఒక చిన్న సినిమా ఈవెంట్ లో నిలబడితే, ఆ చిన్న సినిమాకి ఎంతో పబ్లిసిటీ భారీగా వస్తుంది.
ఆ సినిమా బ్రతికి బట్ట కట్టి.. బయట పడుతుంది.. థియేటర్ లో జనం వస్తారు.. నిర్మాతకి డబ్బు వస్తుంది. ఇంకో కొత్త హీరో పుడతాడు..
కానీ ఇదే సపోర్ట్ చిన్న హీరోలకు, చిన్న సినిమాలు కు ఇస్తే.. పరిశ్రమ కు మంచి జరుగుతుంది..
ఇక్కడ కోపం లేదు, బాధగా ఉంది.
చిన్న హీరోల భాధ నిజం. దిల్ రాజు గారి మాటలు నిజం.. ఇట్లు అర్జునకి వస్తున్న సపోర్ట్ కూడా నిజం..
కానీ ఈ మూడు నిజాలు కలిపి చూస్తే ఒకటే అర్థమవుతుంది.
టాలీవుడ్ లో టాలెంట్ కి విలువ కన్నా.. పరపతికే విలువ ఉంది అని.. అనీష్ ఇచ్చిన సపోర్ట్ చిన్న హీరోలకు ఇస్తే.. టాలీవుడ్ ఇంకా బాగుంటుంది. ఇంకో పది మంది కొత్త హీరోలు పుడతారు.
టాలెంట్ ని నమ్ముకోమని చెప్పడం కాదు, టాలెంట్ ఉన్నోడిని నమ్మి పక్కన నిలబడాలి. అదే అసలు సిసలైన సపోర్ట్. చిన్న హీరోలకు, చిన్న నిర్మాతలకు, పెద్ద హీరోలు, హీరోయిన్లు పబ్లిసిటీ విషయంలో సపోర్ట్ చెయ్యాలని చేస్తారని ఆశిద్దాం.















































