తెల్ల రాముడిని రా'మాయ'ణం.
Since when did our Ramudu become fair-skinned?తెల్ల రాముడిని చూడలేకపోయాను - రామాయణం సినిమా చూసిన తర్వాత భక్తుడి ఆవేదన.
ఈరోజు, నవంబర్ 5, 2026. దేశం మొత్తం ఎదురుచూసిన రోజు. నితీష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన రామాయణం- పార్ట్ 1 ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా పరవాలేదు. విజువల్స్ అద్భుతం. VFX, సంగీతం, యుద్ధ సన్నివేశాలు అన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక నా మనసులో ఒక్కటే ప్రశ్న మిగిలిపోయింది.
మన రాముడు తెల్లగా ఎప్పుడయ్యాడు?
వాల్మీకి చెప్పిన రాముడు ఎవరు? వాల్మీకి రామాయణం తిరగేస్తే రాముడికి ఒక్కటే వర్ణన దొరుకుతుంది.
నీలమేఘ శ్యాముడు
అంటే వర్షం కురిసే ముందు వచ్చే నల్లని మేఘం లాంటి వాడు. నలుపు, నీలం కలిసిన శ్యామ వర్ణం. ఆయన నల్లగా ఉంటాడు. చామన ఛాయలో మెరిసిపోతాడు.
మన తాతలు, మన అమ్మమ్మలు గుడిలో చూసిన రాముడు నల్ల రాముడే. భద్రాచలం రాముడు నల్లగానే ఉంటాడు. ఒంటిమిట్ట రాముడు నల్లగానే ఉంటాడు. అన్ని గుడిలలో నల్ల రాముడు విగ్రహాలే ఉంటాయి.
మరి ఈ సినిమాలో చూపించిన రాముడు ఎవరు? తెల్లగా, ఫెయిర్ గా, బాలీవుడ్ హీరోలానే.. మెరిసిపోతున్నాడు.. తప్ప.. ఎక్కడా రామతనం.. కనపడదు.
తెల్లదనమే అందం అనే భ్రమ
ఇదే మన దేశానికి పట్టిన పెద్ద జబ్బు. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో అయినా, సినిమాలో అయినా, దేవుడిని కూడా తెల్లగా చూపించాలనే తపన. రాముడు నల్లగా ఉంటే ఆయన గొప్పతనం తగ్గిపోతుందా? కృష్ణుడు నల్లగా ఉంటే ఆయన దేవుడు కాకుండా పోతాడా? లేదు. నలుపు అంటే అశుభం కాదు. నలుపు అంటేనే శక్తి. నల్ల మేఘం ఉంటేనే వర్షం. నల్ల మట్టి ఉంటేనే పంట. నల్లని రాముడు ఉంటేనే ధర్మం. మనం మన దేవుడిని కూడా మన ఫెయిర్ నెస్ భ్రమకు బలి చేస్తున్నాం.
రణబీర్ తప్పు కాదు, సిస్టమ్ తప్పు.
రణబీర్ కపూర్ నటన బాగుంది. ఆయన భయంతోనే, భక్తితోనే నటించానని చెప్పాడు. ఆయన తప్పు కాదు. తప్పు మన కాస్టింగ్ లో ఉంది. ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ ను తెల్లగా చూపించారు. మన డైరెక్టర్ల ఆలోచనలో ఉంది. రాముడి పాత్రకు నల్లగా, శ్యామ వర్ణంలో ఉండే నటుడిని ఎంచుకోవచ్చు కదా? లేదా కనీసం మేకప్ తో అయినా ఆ నీలమేఘ ఛాయను తీసుకురావచ్చు కదా? 4000 కోట్లు ఖర్చు పెట్టి VFX చేయగలిగిన వాళ్ళు, రాముడి అసలు రంగును తీసుకురాలేకపోయారా..?
పాత రోజులలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా రాముడు నల్లగానే చూపించి సూపర్ హిట్స్ కొట్టారు.. రాముడు పాత్ర వేసిన మహా నటులు కూడా నీలి మేఘ ఛాయ కల మేకప్ తో అద్భ్యతం నడిచారు. వారిలో దేవుడి ని చూసారు ప్రేక్షకులు.
ఇది నార్త్ vs సౌత్ గొడవ కాదు, కాకూడదు.
ఇక్కడే ఒక ప్రమాదం ఉంది, దాన్ని మనం ముందే చెప్పుకోవాలి. సినిమాలో రాముడిని తెల్లగా చూపించారని అనగానే, కొంతమంది దీన్ని "నార్త్ ఇండియా వాళ్ళు తెల్లగా ఉంటారు, సౌత్ ఇండియా వాళ్ళు నల్లగా ఉంటారు" అనే రీజినల్ ఫీలింగ్ లోకి లాగే ప్రమాదం ఉంది. రాముడు నల్లగా ఉండటం అనేది సౌత్ ఇండియా సమస్య కాదు. అది నార్త్ ఇండియా సమస్య కూడా కాదు. అది భారతదేశం మొత్తం సమస్య. వాల్మీకి రాసింది ఉత్తరాదిలోనే, రాముడు పుట్టింది ఉత్తరాదిలోనే. అయినా వాల్మీకి ఆయన్ని నీలమేఘ శ్యాముడు అనే అన్నాడు.
నార్త్ లో కూడా లక్షల మంది నల్లగా ఉంటారు. సౌత్ లో కూడా లక్షల మంది తెల్లగా ఉంటారు. రంగును ప్రాంతంతో ముడిపెట్టడం తప్పు.
ఈ ఆర్టికల్ ఉద్దేశం నార్త్ వాళ్ళని తిట్టడం కాదు, సౌత్ వాళ్ళని పొగడడం కాదు. మన దేవుడి అసలు రూపాన్ని మర్చిపోతున్నాం అని చెప్పడమే. దీన్ని రీజినల్ గొడవగా మారిస్తే, అసలు విషయం - రాముడి శ్యామ వర్ణం - పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి దీన్ని నార్త్ vs సౌత్ గా చూడొద్దు. ధర్మం vs ఫెయిర్ నెస్ భ్రమ గా మాత్రమే చూడండి.
సినిమా చూస్తున్నప్పుడు పక్కన కూర్చున్న మీ కొడుకు అడగవచ్చు. నాన్న, రాముడు ఇంత తెల్లగా ఉంటాడా?
మనం ఏం చెప్పాలి? మన పుస్తకాల్లో రాముడు నల్లగా ఉంటాడు అని చెప్పాలా? లేక సినిమాలో చూపించిందే నిజం అని చెప్పాలా? రేపటి తరానికి రాముడు అంటే తెల్ల రాముడే గుర్తుండి పోతాడేమో అని భయంగా ఉంది.
సినిమా పరవాలేదు, కానీ తెల్ల రాముడిని చూడలేకపోయాము.
రాముడు నీలమేఘ శ్యాముడు. ఆయనను నల్లగానే చూడాలని ఉంది. ఆయనను నల్లగానే పూజించాలని ఉంది.
















































