విశాఖలో వైభవంగా మొదలైన CII సదస్సు!
CII Partnership Summit 2027 begins in Visakhapatnam
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. CII పార్ట్నర్ షిప్ సదస్సు కోసం నిన్న బుధవారమే మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు. ఈరోజు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఈ సదస్సు ప్రాంగణానికి చేరుకోగా అధికారులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల రాకతో విశాఖ నగరం పారిశ్రామిక కళను సంతరించుకుంది. సదస్సు ప్రారంభంలో భాగంగా ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పీయూష్ గోయల్, పవన్ కళ్యాణ్ స్వయంగా డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు.
అనంతరం పెవిలియన్‌లో తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఎకనమిక్ రీజియన్లతో పాటు సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు ఇచ్చిన డిజిటల్ ప్రజెంటేషన్‌ను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరావతి టవర్ మోడల్ అందరినీ ఆకట్టుకుంది.
అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి, గ్రోత్ స్టోరీలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్స్ మీద అధికారులు ప్రదర్శించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఎకనమిక్ రీజియన్లలో జరుగుతున్న అభివృద్ధి, సీఆర్డీఏ పరిధిలోని కీలక ప్రాజెక్టులపై అధికారులు సవివరమైన డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
















































