విధ్వంసం కాదు సరిచేయడం ముఖ్యం: పవన్
Janasenani Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా అందరి అభిమానం, మన్ననలు చూరగొంటున్నారు. ఆయన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల వేళ యువతరానికి ఇచ్చిన సందేశం ఆదర్శప్రాయమైనది. తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలకు జనసేనాని అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మీడియా వేదికలపై మాట్లాడేటప్పుడు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు అత్యంత సంయమనం పాటించాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాలు లేదా వివాదాలపై స్పందించే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ పరిమితులు దాటకూడదని.. వైఖరి ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉండాలని హెచ్చరించారు.
రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం.. ఇతరుల ప్రైవేట్ జీవితాలపై కామెంట్లు చేయడం.. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా పార్టీ విధానాలకే కట్టుబడి ఉండాలని.. ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి గౌరవప్రదమైన రీతిలో ప్రవర్తించాలని సూచించారు. దీనికితోడు పార్టీకి సంబంధించిన అంతర్గత సంస్థాగత వ్యవహారాలను సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడం సరికాదని.. క్రమశిక్షణను ఉల్లంఘించే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించేది లేదని జనసేన కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ ధర్మాన్ని... స్ఫూర్తిని నిలబెట్టేలా ప్రతిఒక్కరి బహిరంగ ప్రకటనలు ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనసేన - కూటమి నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో కుట్రపూరిత ప్రచారాలు చేసే అవకాశం ఉందని... అలాంటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేటప్పుడు కూడా ఎలాంటి ఆవేశానికి గురికాకుండా.. అనుచిత పదజాలం వాడకుండా బాధ్యతాయుతంగా స్పందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మరొక వైపు విభజన గాయాల జ్ఞాపకార్థ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేసారు. 1947 నాటి దేశ విభజన వల్ల మిలియన్ల కొద్దీ ప్రజల జీవితాలు ఏ విధంగా మారిపోయాయో ఆయన గుర్తుచేసుకున్నారు. ఇళ్లను వదిలేయాల్సి రావడం.. కుటుంబాలు విడిపోవడం.. సమాజాలు స్థానభ్రంశం చెందడం వంటి ఎన్నో బాధలు- అనిశ్చితిని ఆనాటి ప్రజలు అనుభవించారని.. అయితే ఆ చీకటి రోజుల్లో కూడా వారు అసాధారణమైన ధైర్యం- ఓర్పు - మానవత్వాన్ని ప్రదర్శించారని కొనియాడారు.
మన చరిత్రలోని ఈ ఘట్టాన్ని గుర్తుంచుకోవడం అంటే విభజనలను ముందుకు తీసుకెళ్లడం కాదని.. దాని ద్వారా నేర్చుకున్న పాఠాలను ముందుకు తీసుకెళ్లడమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆనాడు బాధలు అనుభవించిన వారి జ్ఞాపకాలు మనందరిలో ఐక్యత- సామరస్యం- శాంతి.. భారతీయ స్ఫూర్తిపట్ల అంకితభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గతాన్ని గౌరవంతో స్మరించుకుంటూ.. నాటి కష్టాలను భరించిన వారిని గౌరవిస్తూ..మనమందరం కలిసి రేపటి భవిష్యత్తును నిర్మించుకుందామని పవన్ పిలుపునిచ్చారు.







































