వ్యభిచార రాకెట్ భగ్నం...
Human Trafficking Racketమహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. హిందీ టెలివిజన్ సీరియల్స్ మరియు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న 35 ఏళ్ల ఒక నటిని వ్యభిచార కూపం, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ర్యాకెట్ నుంచి పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన వినోద రంగంలో తీవ్ర కలకలం రేపింది.
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన మహిళలను టార్గెట్ చేసుకుని ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, ఫోటో షూట్‌లలో అవకాశాలు ఇప్పిస్తామనే పేరుతో అమాయక మహిళలను ర్యాకెట్ నిర్వాహకులు బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒక స్వచ్ఛంద సంస్థ అందించిన పక్కా సమాచారం ఆధారంగా థానే పోలీసులు రంగంలోకి దిగారు. అక్టోబర్ 8న మీరా-భయందర్ రోడ్డులోని ఒక హోటల్‌కు పోలీసుల బృందం నకిలీ కస్టమర్‌ను (డికాయ్) పంపింది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ఆ హోటల్‌పై మెరుపు దాడి చేసి ఈ గుట్టును రట్టు చేశారు. ఈ దాడిలో వ్యభిచార ర్యాకెట్‌ను నడుపుతున్న ప్రధాన నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాకు చెందిన, ప్రస్తుతం ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో నివసించే తబస్సుమ్ అలియాస్ సోనియా ఉమర్ ఖురేషి (39) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు తీసుకుంటూ ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రాకెట్ బారిన పడిన 35 ఏళ్ల టెలివిజన్ నటిని పోలీసులు సురక్షితంగా కాపాడి, ముంబైలోని రెస్క్యూ ఫౌండేషన్ సంరక్షణ కేంద్రంలో ఉంచారు. బాధితురాలి గోప్యత దృష్ట్యా పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆమెకు తగిన భద్రత , కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితురాలు ఖురేషిపై బీఎన్ ఎస్ సెక్షన్ 143 (మానవ అక్రమ రవాణా) , అనైతిక రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ దందాలో ఆమెకు సహకరిస్తున్న పరారీలో ఉన్న మరో పురుష నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.















































