ఒకేసారి 9 సినిమాలు వస్తే బాక్సాఫీస్ పరిస్థితేంటి?
This Week Theatrical Releasesఈసారి బాక్సాఫీస్ వద్ద తొమ్మిది సినిమాలు ఒకేసారి పోటీపడడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలవుల కాలాన్ని వాడుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు ఇలాంటి లాంగ్ వీకెండ్స్‌పై ఎక్కువగా దృష్టి పెడతారు. అయితే ఒకే వారంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు రావడం వల్ల థియేటర్ల కేటాయింపు సమస్యగా మారడమే కాకుండా థియేటర్లకు వచ్చే కొద్దిమంది ప్రేక్షకులు వేర్వేరు సినిమాలకు విడిపోయి వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ వరుస విడుదలల వెనుక ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే? చాలా సినిమాలకు తగినంత ప్రీ-రిలీజ్ హైప్ బలమైన ప్రచారం లేకపోవడమే. ఏ సినిమాకీ సరైన బజ్ లేకపోవడంతో ప్రేక్షకులు ఏ చిత్రం చూడాలనే విషయంలో స్పష్టత లేక నీరసిస్తున్నారు. టికెట్ ధరలు పెరిగిన ప్రస్తుత కాలంలో ఓటీటీలు అందుబాటులో ఉన్న వేళ, కనీస స్థాయి అంచనాలు లేదా ఆకర్షణీయమైన ప్రమోషన్లు లేకుండా జనాన్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టం. దీంతో ఈ చిత్రాలు కేవలం విడుదలయ్యాక వచ్చే మాత్ టాక్ పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.
ఇలాంటి పోటీ వాతావరణంలో బాక్సాఫీస్ నిలదొక్కుకోవాలంటే సినిమాల్లోని కంటెంట్ అత్యంత అద్భుతంగా ఉండటం ఒక్కటే మార్గం. తొమ్మిది చిత్రాలలో ఏవైనా ఒకటి లేదా రెండు సినిమాలు బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రమే నిలదొక్కుకోగలవు. మిగిలిన చిత్రాలు సరైన ప్రచారం , స్క్రీన్లు లేక బాక్సాఫీస్ వద్ద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకే వీకెండ్‌లో అన్ని సినిమాలను రద్దీగా దించడం కంటే, సరైన ప్రణాళికతో ప్రచారాన్ని వేగవంతం చేస్తూ విడివిడిగా విడుదల చేయడం టాలీవుడ్ మార్కెట్‌కు ఎంతైనా మేలు చేస్తుంది.
















































