ఏకంగా ఏడు వేల కోట్లు డిమాండ్ చేసిన నటి!
Urvashi Rautela Seeks Rs 7,000 Crore From US Company
బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశి రౌతేలా లీగల్ నోటీసులతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. తన పేరు, ఇమేజ్ వ్యక్తిగత గుర్తింపును అనధికారికంగా, వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారంటూ ఆమె లీగల్ టీమ్ ఏకంగా 7,000 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. అనుమతి లేకుండా తన పేరును వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఊర్వశి న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఊర్వశి లీగల్ టీమ్ స్పందిస్తూ అనుమతి లేని బ్రాండ్ ప్రమోషన్లు, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ కంటెంట్, డిజిటల్ ఉత్పత్తులు , ఇతర వాణిజ్య ప్రకటనలలో ఆమె పేరును నిరంతరం వాడుతున్నారని ఆరోపించారు. ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీగా ఉన్న నటి ఇమేజ్ను ఇలా ఉపయోగించడం వల్ల ఆమె బ్రాండ్ వాల్యూ తీవ్రంగా దెబ్బతింటోందని, అందుకే భారీ స్థాయిలో నష్టపరిహారాన్ని డిమాండ్ చేసినట్లు వివరించారు.
ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ రక్షణపై చర్చ పరపాటైంది. అనుమతి లేకుండా తారల వాయిస్, ముఖం, పేరు , మేనరిజమ్‌లను బిజినెస్ ప్రమోషన్ల కోసం వాడటం చట్టరీత్యా నేరమని గతంలో పలు హైకోర్టులు కూడా కీలక తీర్పులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఊర్వశి రౌతేలా బృందం తీసుకున్న కఠిన నిర్ణయం ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది.
తన గ్లోబల్ గుర్తింపు నటిగా సంపాదించుకున్న ఇమేజ్ను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఊర్వశి లీగల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎవరైనా సరే తమ ముందస్తు అనుమతి, అంగీకారం లేకుండా లీగల్ హక్కులను ఉల్లంఘిస్తే తీవ్ర చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కేసు ద్వారా సెలబ్రిటీల వ్యక్తిగత డిజిటల్ రక్షణపై స్పష్టమైన హెచ్చరికలు పంపినట్లయిందని లీగల్ టీమ్ అభిప్రాయపడింది.
మరోవైపు ఊర్వశి రౌతేలా లీగల్ నోటీసుల్లో 7,000 కోట్ల భారీ నష్టపరిహారం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్లు , ట్రేడ్ విశ్లేషకులు ఈ అంశంపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పేర్లు, ఇమేజ్‌లను ఇష్టారీతిన వాడే సంస్థలకు, థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌లకు ఈ లీగల్ నోటీసులు పెద్ద షాక్‌గా మారాయనడంలో సందేహం లేదు.
















































