అందాలు కాదు.. చెమట, కండరాలే మా గుర్తింపు!
Sydney Sweeney ad controversy timelineహాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ నటించిన `నోవిగ్` స్పోర్ట్స్ యాడ్ అంతర్జాతీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ప్రచార చిత్రంలో ఆమె శరీరాన్ని కేవలం ఫుట్‌బాల్స్, ఇతర క్రీడా పరికరాలతో మాత్రమే కవర్ చేస్తూ కనిపించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా అథ్లెట్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. క్రీడారంగంలో మహిళలను కేవలం లైంగిక కోణంలోనే చిత్రీకరిస్తూ వారి శరీరాలను వ్యాపార వస్తువులుగా మార్చడం దారుణమని ఒలింపిక్ స్విమ్మింగ్ పసిడి విజేత అరియార్న్ టిట్మస్ సహా పలువురు స్టార్ ప్లేయర్లు సోషల్ మీడియా వేదికగా అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఈ యాడ్‌పై స్పందించిన బ్రిటిష్ స్ప్రింటర్ ఎలోయిస్ హంట్ - మాజీ యూఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, క్రీడల్లో ఉండే మహిళల నిజమైన రూపం వారి కండరాలు, చెమట, కన్నీళ్లు మరియు కష్టపడే తత్వమే అని స్పష్టం చేశారు. సమాజం ఏర్పరిచే అందాల ప్రమాణాలకు భిన్నంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళా అథ్లెట్ల శ్రమను చులకన చేస్తూ ఇలాంటి ప్రకటనలు రూపొందించడం ప్రపంచంలోని ప్రతీ క్రీడాకారిణిని అవమానించడమేనని జర్మన్ రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా వ్యాఖ్యానించారు.
ఈ విమర్శల తుఫాన్ మధ్య సిడ్నీ స్వీనీ పరోక్షంగా స్పందిస్తూ గతంలో క్రీడాకారుల శరీర దృఢత్వాన్ని వేడుకగా జరుపుకునేందుకు రూపొందించిన ఈఎస్‌పీఎన్ బాడీ ఇష్యూ మ్యాగజైన్ కవర్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతేడాది ప్రసిద్ధ బాక్సర్ క్రిస్టీ మార్టిన్ బయోపిక్‌లో నటించిన సిడ్నీకి ఇలాంటి బ్రాండ్ ప్రచారాల వల్ల వివాదాలు ఎదురవడం మొదటిసారేమీ కాదు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారడమే కాకుండా.. క్రీడారంగంలో మహిళల చిత్రీకరణపై మరోసారి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
















































