ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డేంజరస్ విలన్!
Mohanlal’s L367 officially titled Operation Gangaమోహన్‌లాల్ కథానాయకుడిగా మేప్పడియాన్ ఫేమ్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `ఆపరేషన్ గంగ`. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకున్న దాదాపు 23,000 మంది భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతుండటం విశేషం. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఆదిల్ హుస్సేన్ మరియు పార్తిబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విష్ణు మోహన్ జార్జియాలో మూడు నెలల పాటు సాగే షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `అర్జున్ రాంపాల్‌ను మలయాళంలోకి తీసుకురావడానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ కథ , కథనం ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించారు` అని తెలిపారు. ప్రతి పాత్ర అవసరానికి తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేశామని, కేవలం ఇతర భాషల నటులు కావాలనే ఉద్దేశంతో ఎవరినీ తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ భారీ డ్రామాకు సరికొత్త సాంకేతిక బృందం పని చేస్తోంది. `ధురంధర్` ఫేమ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా `పుష్ప` చిత్రాలకు పనిచేసిన పోలిష్ సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. విద్యార్థులు, అధికారులను సంప్రదించి సమగ్రమైన పరిశోధన చేసి కథను సిద్ధం చేశామని, వాస్తవ సంఘటనలకు అద్దం పడుతూనే అవసరమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని దర్శకుడు వెల్లడించారు.







































