`లక్కీ భాస్కర్ 2` ప్రాజెక్ట్ రీ-యూనియన్!
Dulquer Salmaan to reunite with Venky Atluri for Lucky Bhaskarమలయాళ వర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్- టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ అయిన `లక్కీ భాస్కర్` సీక్వెల్‌పై అధికారిక ప్రకటన రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ కాంబినేషన్ మళ్లీ `లక్కీ భాస్కర్ 2` కోసం చేతులు కలపబోతుండటం సినీ ప్రియుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచుతోంది.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం `ఐయామ్ గేమ్` ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరి, దుల్కర్ ఒకే వేదికపై ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడూతూ తన మునుపటి కమిట్‌మెంట్స్ పూర్తి కాగానే ఖచ్చితంగా లక్కీ భాస్కర్ 2 కథతో వస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై దుల్కర్ సల్మాన్ కూడా సంతోషం వ్యక్తం చేసారు. తాను ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చారు.
మొదటి భాగం అందించిన అపూర్వ ఆదరణ గురించి దుల్కర్ మాట్లాడుతూ.. `నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు భాస్కర్ అనే పిలుస్తున్నారు. ఈ పాత్రకు దక్కిన ప్రేమాభిమానం ఎంతో గొప్పది` అని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వెంకీ అట్లూరితో పనిచేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. లక్కీ భాస్కర్ 2 అయినా లేదా సరికొత్త కథ అయినా ఆయనతో మళ్లీ పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని దుల్కర్ ప్రకటించారు.
మధ్య తరగతి బ్యాంక్ క్యాషియర్ ఆర్థిక ఇబ్బందులను దాటుకుని, అక్రమ మార్గాల్లో కోట్లు గడించే ఒక థ్రిల్లింగ్ పీరియాడిక్ డ్రామాగా లక్కీ భాస్కర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1980, 90ల నాటి ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వినూత్న స్క్రీన్‌ప్లేతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా సుదీర్ఘకాలం ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టించింది.
సీక్వెల్ విషయంలో తనపై భారీ బాధ్యత .. ఒత్తిడి ఉందని దర్శకుడు వెంకీ అట్లూరి అంగీకరించారు. మొదటి భాగం తెచ్చిన ఘన విజయం రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో, వైవిధ్యమైన ఆర్థిక నేరాల నేపథ్యంతో రూపొందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని చిత్ర బృందం సూచన ప్రాయంగా తెలియజేసింది.







































