ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood Box Office Boom In Second Half Of 2026

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సెకండ్ హాఫ్ జోరు!

Tollywood Box Office Boom In Second Half Of 2026Tollywood Box Office Boom In Second Half Of 2026

2026  ద్వితీయార్థంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊహించని విజయోత్సవంతో దూసుకుపోతోంది. వేసవి సీజన్ ముగిసిన తర్వాత కొంత మందగించినట్లు కనిపించిన మార్కెట్, జూలై నెల రాకతో ఒక్కసారిగా సరికొత్త ఊపిరి పోసుకుంది. స్టార్‌డమ్ కంటే కంటెంట్‌కే ప్రేక్షకులు తొలి ప్రాధాన్యత ఇస్తారని నిరూపిస్తూ జూలైలో థియేటర్లలోకి వచ్చిన `లెనిన్` , `చెన్నై లవ్ స్టోరీ` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి ఘన విజయం సాధించాయి. విభిన్నమైన కథాంశాలతో రూపొందిన చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించి టాలీవుడ్ సెకండ్ హాఫ్‌కు సాలిడ్ ప్రారంభాన్ని ఇచ్చాయి.

జూలై నెల అందించిన ఉత్సాహాన్ని ఆగస్టు నెల మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ నెలలో విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలు వరుసగా సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో బాక్సాఫీస్ కలాకలలాడుతోంది. విభిన్నమైన ఎమోషన్స్ డ్రామాతో ఆకట్టుకున్న `విశ్వనాథ్ అండ్ సన్స్`, సరికొత్త హారర్-కామెడీ డోస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన `కొరియన్ కనకరాజు`,  బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న `ఇరుముడి` చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో వంద శాతం విజయవంతమయ్యాయి.

వరుస విజయాలు టాలీవుడ్ పరిశ్రమలో సరికొత్త ఆశలను, నూతనోత్సాహాన్ని నింపాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే? కేవలం భారీ బడ్జెట్ లేదా స్టార్ కాంబినేషన్లు మాత్రమే సరిపోవని, ప్రేక్షకుడిని కట్టిపడేసే కథ, కథనాలు ఉన్నప్పుడు ఏ సినిమానైనా ఆదరిస్తారని ఈ చిత్ర ఫలితాలు మ‌రోసారి నిరూపించాయి. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన  జోరు రాబోయే పండుగ సీజన్లకు బలమైన పునాదిగా మారింది.

ద్వితీయార్థం ప్రారంభంలోనే వరుస విజయాలు నమోదు కావడంతో సెప్టెంబర్, దసరా ,  దీపావళి రేస్‌లలో రాబోతున్న తదుపరి చిత్రాలపై కూడా  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే తరహాలో మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ ఈ ఏడాది ఆఖరి వరకు సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
 

Telugu Cinema Solid Comeback in Second half of 2026