షావుకారు జానకి మృతి: చిరు-బాలయ్య సంతాపం
Sowcar Janaki death: Veter actor passes away at 94
చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన షావుకారు జానకి
వయోభారం, శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందిన షావుకారు జానకి
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 385 కుపైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన కథానాయికగా నటించిన షావుకారు జానకి
చిరంజీవి:
ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది.
‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం.
షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏
బాలకృష్ణ:
షావుకారు జానకిగారితో మా అనుబంధం ప్రత్యేకం - నందమూరి బాలకృష్ణ
మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర ధరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది.
మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.








































