ప్లాప్ ను అంగీకరించడంలో సిగ్గు పడక్కర్లేదు!
Manoj Muntashir admits Adipurush failed to meet expectationsపాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్ చిత్రంగా మిగిలిపోయింది. తాజాగా ఈ పరాజయం `ఆదిపురుష్` చిత్రానికి డైలాగ్స్ అందించిన రచయిత మనోజ్ మున్తాషిర్ స్పందించారు. ఒక చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పుడు దాన్ని అంగీకరించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సినిమాతో ముడిపడిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం వల్ల విఫల ప్రయత్నంగా మిగిలిపోయిందని నిజాయితీగా అంగీకరించారు.
నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న `రామాయణం` సినిమాతో `ఆదిపురుష్` ను పోల్చడం సరికాదని మనోజ్ మున్తాషిర్ హితవు పలికారు. కొత్త ప్రాజెక్ట్‌లో రావణాసురుడిగా నటిస్తున్న నటుడు యష్ ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. యష్ ఎంతో గొప్ప నటుడని, మన పురాణ గాథలను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చే ప్రతి ప్రయత్నానికీ శుభాకాంక్షలుంటాయన్నారు. అలాగే `రామాయణం` ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ చిత్రంలోని సంగీతం మాత్రం ప్రజల హృదయాలను గెలుచుకుందని సంతోషం వ్యక్తం చేశారు. `ఆదిపురుష్` మ్యూజిక్ సాధించిన విజయమే `రామాయణం` చిత్రానికి కూడా దక్కాలని, అంతకంటే మెరుగైన ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. పరిశ్రమలో విజయాలు, అపజయాలు సహజమని గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే ముఖ్యమని సంకేతం ఇచ్చారు.
















































