ఓటిటి కంటెంట్ కి నియంత్రణ అవసరమా?

OTT Content

డిజిటల్ స్ట్రీమింగ్ మాధ్యమాలు వినోద ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో వాటిలోని కంటెంట్‌పై సెన్సార్‌షిప్ అవసరమనే గళం బలంగా వినిపిస్తోంది. సెన్సార్ బోర్డు పర్యవేక్షణలో ఉండే థియేటర్ సినిమాలతో పోలిస్తే, ఓటిటిలో ఎలాంటి కట్టడి లేని కంటెంట్ ఉండటం  చర్చాంశమైంది. హింస, బూతులు, అసభ్యకర సన్నివేశాలతో కూడిన వెబ్ సిరీస్‌లు  కుటుంబ సభ్యులందరూ కలిసి చూడటం ఇబ్బందికరంగా మారుతోందనే ఆందోళన వెల్లు వెత్తుతోంది.

ఒకే రకమైన వినోద పరిశ్రమలో రెండు రకాల ప్రమాణాలు ఉండటం సినీ నిర్మాతలను కలవరపెడుతోంది. థియేటర్లలో విడుదల కావాలంటే ? సెన్సార్ కత్తెరలకు తలవంచాలి.  కానీ అదే కథను ఓటిటిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడొచ్చు. ఈ ద్వంద్వ విధానం థియేటర్ మార్కెట్‌ను దెబ్బతీస్తోందనేది కొందరి వాదన. మేకర్స్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణమవుతుండటంతో? థియేటర్ యజమానులు .. నిర్మా తలు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని కోరుతున్నారు.

అయితే ఓటిటిని సెన్సార్ చేయడం అనేది క్రియేటివ్ ఫ్రీడమ్‌ను అణచివేయడమే అవుతుందని కళాకారులు హెచ్చరిస్తున్నారు. సెన్సార్‌షిప్ అనేది కథలోని లోతును, వాస్తవికతను దెబ్బతీస్తుందని సృజనాత్మకతకు అడ్డుకట్ట వేస్తుందని వాదిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లకు .. ప్రేక్షకులకు మధ్య ఉండాల్సిన బంధాన్ని అధికారిక ఆంక్షలు నిర్ణయించకూడదన్న‌ది వారి అభిప్రాయం. సెన్సార్‌కు బదులుగా, సెల్ఫ్-రెగ్యులేషన్ లేదా కఠినమైన ఏజ్-రేటింగ్ సిస్టమ్‌ను పటిష్టం చేయడమే సరైన మార్గమని మేధావులు సూచిస్తున్నారు.

ఈ వివాదానికి పరిష్కారం సెన్సార్‌షిప్ లో ఉందా?  లేక బాధ్యతాయుతమైన ప్రసారంలో ఉందా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం .. ప్లాట్‌ఫారమ్‌ల మధ్య చర్చలు జరిగి సామాజిక విలువలకు భంగం వాటిల్లకుండా కళాత్మక స్వేచ్ఛను కాపాడే  సమగ్ర విధానం అవసరం. డిజిటల్ యుగంలో ప్రేక్షకులే విచక్షణతో ఉండటం ఒక ఎత్తు అయితే? తయారీదారులు సామాజిక బాధ్యతను గుర్తించడం మరొక‌ ఎత్తు. అంతిమంగా ప్రేక్షకుల వీక్షణ అను భవాన్ని మెరుగుపరిచే దిశగా ఓటిటి నియంత్రణ వ్యవస్థలు పరిణామం చెందాల్సి ఉంది.
 

OTT - Censor