ఆరుగురు దర్శకులతో యంగ్ హీరో ప్రయోగం!
Pradeep Ranganathan Launches PR Show Bannerతమిళ నటుడు- దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో సరికొత్త అడుగు వేశారు. ఇటీవలే `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` చిత్రంతో ఎదురుదెబ్బ తగిలినా? ఏ మాత్రం వెనకడుగు వేయకుండా `PR షో` అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో నిర్మిస్తున్న తదుపరి చిత్రం గురించి ఓ ప్రత్యేకమైన ప్రకటన చేశారు.
తదుపరి సినిమా కోసం ఏకంగా ఆరుగురు దర్శకుల్ని రంగంలోకి దింపుతున్నాడు.
ఆరుగురు దర్శకుల బృందాన్ని ప్రదీప్ `ద ఆల్ఫా యూనిట్` అని పిలుస్తున్నారు. వీరిలో విశాల్ టిఆర్, యశ్ వి, నరేన్ సావొడా, చణక్యన్ ఆర్, ధనుష్ కుమార్ , ఇళంపరిధి ఉన్నారు. వీరంతా నూతన దర్శకులే కావడం విశేషం. వీరిలో కొందరు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉండగా మరికొందరు లఘు చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన వారు.
ఒకే సినిమాకు ఆరుగురు దర్శకులు కలిసి పనిచేయడం అనేది తమిళ పరిశ్రమలో ప్రయోగాత్మక ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు , అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. `డ్యూడ్`, `డ్రాగన్` వంటి హిట్ చిత్రాల తర్వాత వీరి కలయిక మరోసారి తెరపై చూడబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంతో అనిమిక మహి అనే కొత్త నటి పరిచయం కానుండగా కీలక పాత్రల్లో స్వాసిక, శివాజీ నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వయంగా ఈ చిత్రానికి కథను అందిస్తూ, నిర్మిస్తున్నారు.







































