ఖాకీ డైరెక్టర్ తో సింగం బరిలోకా?
Suriya is all set to join hands with director H. Vinoth
కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన `కరుప్పు` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో మార్కెట్ మరింత పుంజుకుంది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన `విశ్వనాథ్ అండ్ సన్స్` ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతుంది. ఇంకా `ఆవేశం` ఫేమ్ జిత్తు మాధవన్ కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నారు.
మరోవైపు స్టార్ డైరెక్టర్ హెచ్. వినోద్ తో సూర్య తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. గతంలో కార్తీతో `ధీరన్ అధిగారమ్ ఒండ్రు` (తెలుగులో ఖాకీ) వంటి రియలిస్టిక్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
సామాజిక అంశాలతో కూడిన పవర్‌ఫుల్ యాక్షన్ కథలను, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంలో హెచ్. వినోద్ శైలి ప్రత్యేకమైనది. సూర్య లాంటి అద్భుతమైన పర్ఫార్మర్‌తో వినోద్ జతకడితే థియేటర్లలో సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గనుక హిట్ అయితే వినోద్ సినిమాలపై అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయి. వినోద్ తో సినిమా చేస్తే గనుక సూర్యకు 49వ చిత్రమవుతుంది.
















































