బెంగాలీ మహానాయకుడిపై బోమన్ ఇరానీ ప్రశంసలు!
Boman Irani Praises Uttam Kumar
బెంగాలీ దిగ్గజ నటుడు ఉత్తమ్ కుమార్ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఘనంగా నివాళులర్పించారు. శతాబ్ది జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన బోమన్ ఇరానీ, ఉత్తమ్ కుమార్ లాంటి అరుదైన నటుల సేవలను రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నిరంతరం స్మరించుకోవాలని వ్యాఖ్యానించారు. నటన, వ్యక్తిత్వం, ఆకర్షణల్లో ఉత్తమ్ ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు.
`మేము చిన్నతనంలో ఉన్నప్పుడు శక్తి సమంత దర్శకత్వంలో వచ్చిన ద్వైభాషా చిత్రం (హిందీ..బెంగాలీ) `అమానుష్` ద్వారా ఉత్తమ్ దా (ఉత్తమ్ కుమార్) నటనకు అభిమానులుగా మారిపోయాం. షర్మిలా ఠాగూర్తో కలిసి ఉత్తమ్ చేసిన చిత్రాలు అద్భుతం. ఉత్తమ్ చిరునవ్వు, ముఖంలోని తేజస్సు, రాజసంతో కూడిన వ్యక్తిత్వం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాలం మారినా మా మనస్సుల్లో ఆయన ఎప్పటికీ ఎంతో అందమైన ఉత్తమ్ దాగానే నిలిచిపోతారన్నారు.
భాషలతో సంబంధం లేకుండా మంచి సినిమాల్లో నటించడంపై తనకున్న ఆసక్తిని వెల్లడించిన బోమన్ ఇరానీ బెంగాలీ చిత్రపరిశ్రమ నుంచి మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నటనకు, కళకు భాష హద్దులు కావని స్పష్టం చేశారు.
















































