టీచర్స్ డే పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
Teachers’ Day? RGV Has Something Else to Say!
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏ విషయంపైనైనా తనదైన శైలిలో భిన్నంగా స్పందిస్తుంటారు. తాజాగా ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశమయ్యాయి. సాంప్రదాయ విద్యావ్యవస్థను, బోధనా పద్ధతులను ప్రశ్నిస్తూ.. తాను ఎప్పటికీ ఎవరికీ హ్యాపీ టీచర్స్ డే అని శుభాకాంక్షలు చెప్పనని వర్మ తెగేసి చెప్పారు. నేర్చుకోవడం కంటే, నేర్చుకున్నదానిని మరచిపోవడమే నిజమైన అభ్యాసమని అభిప్రాయపడ్డారు.
తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడానికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ - స్టీవెన్ స్పీల్‌బెర్గ్ వంటి దిగ్గజాల జీవిత ఉదాహరణలను వర్మ గుర్తు చేశారు. `పాఠశాలలో నేర్పినది మర్చిపోయిన తర్వాత కూడా మిగిలేదే అసలైన విద్య` అని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆర్‌జీవీ ఉటంకించారు. అలాగే హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ చదువుకునే రోజుల్లో అకాడెమిక్ తరగతుల్లో సాధించిన జ్ఞానం కంటే ఆయన సొంతంగా సినిమాలు చూస్తూ .. ఆలోచిస్తూ నేర్చుకున్న జ్ఞానమే ప్రపంచ స్థాయి దర్శకుడిగా నిలబెట్టిందని వర్మ విశ్లేషించారు.
గురువులు సాధారణంగా పాత ఆలోచనలను, పరిమితులను మాత్రమే నూరిపోస్తారని, వినూత్నంగా ఆలోచించే స్వేచ్ఛను అణచివేస్తారని వర్మ వాదించారు. మనిషి సొంత అనుభవాల ద్వారా, స్వయంగా నేర్చుకునే విద్యే అత్యంత శక్తివంతమైనదని అందుకే మూస పద్ధతుల్లో బోధించే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పడం తన తత్వానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫిలాసఫికల్ వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారితీసి వైరల్‌గా మారాయి.







































