ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan garu Spoke to Me After Seeing My Work –Music Director Ajay Arasada

పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ ను మెచ్చుకున్నారు -సంగీత దర్శకుడు అజయ్ అరసాడ

Pawan Kalyan garu Spoke to Me After Seeing My Work –Music Director Ajay ArasadaPawan Kalyan garu Spoke to Me After Seeing My Work –Music Director Ajay Arasada

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

మీ నేపథ్యం గురించి చెప్పండి?
మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్‌లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు.

చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?
చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు.

మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా?
అన్ని రకాల జానర్‌లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. తమిళ్ నుంచి వస్తే కొత్తగా ఇస్తాడు, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్‌గా ఇస్తారని ఇక్కడ కొంత మంది నమ్ముతారు.

బడ్జెట్‌ను పట్టి మ్యూజిక్ మారుతుందా?
ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్‌ స్టార్టింగ్‌లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ).

థియేటర్‌ కోసం పని చేసినప్పుడు, ఓటీటీ కోసం పని చేసినప్పుడు ఉండే తేడా, మీకు కలిగే ఫీలింగ్ ఏంటి?
మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. దాన్ని చివరకు ఓటీటీలోకి తీసుకు వస్తారు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవుతుంది. ‘వికటకవి’ని ఒకవేళ థియేటర్‌లో చూస్తే సౌండింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓటీటీకి వచ్చే సరికి నేను చేసిన యాభై శాతానికి పడిపోతుంది.

మ్యూజిక్ మీద ఏఐ ప్రభావం ఎంత వరకు ఉంటుంది?
మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఏఐలో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటాయి. కొంత మంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి.. ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది (నవ్వుతూ). ఏఐని వాడి ఏ టెక్నీషియన్ అయినా పని చేయొచ్చు. కానీ ఏఐని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చని మాత్రం అనుకోకూడదు (నవ్వుతూ).

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏం మాట్లాడారు?
నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తాను. మొన్న మోదీ గారిని ఆయన కలిసినప్పుడు ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసి ఆయన పిలిపించారు. ఆయనతో నాతో పర్సనల్‌గా మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా సరే పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామని ఆయన అన్నారు.

జన సేన కోసం ఎప్పటి నుంచి పని చేశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది?
వెంకట్ చిక్కాల అనే నా మిత్రుడు అక్కడ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. అలా నా ఫ్రెండ్ వల్ల ఆ అవకాశం వచ్చింది. బన్నీ వాస్ గారు కూడా నాతో చాలా వర్క్ చేయించారు. అక్కడి నుంచే నాకు ‘ఆయ్’ అవకాశం వచ్చింది.

మీరు బయట ఎక్కడా ఎందుకు కనిపించరు?
నాకు బయటకు వచ్చి నా పనితనం గురించి నేనే చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లలో కనిపించను. సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడం అన్నది నాకు తెలియదు.

పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని చెప్పిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి?
నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నా. కానీ మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా. కానీ నేను వెళ్లే సరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఆయన చెప్పారు.

మీ దగ్గర ఉన్న ఓ వస్తువు గురించి ఆయన అడిగారని తెలిసింది?
నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఉండే ఓ బోస్ స్పీకర్ ఉంటుంది. ఇదేంటి ఆయన అడిగారు. దాన్ని పట్టుకుని సరదాగా చూసుకుంటూ నవ్వారు. ఇదేంటి కాఫీ కప్పులా ఉందని కామెడీ చేశారు. కాఫీ పట్టుకొచ్చావా? అని జోక్స్ వేశారు. ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారు అని అనుకుని లోలోపల సంబరపడిపోయాను.

ఇప్పుడున్న దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంది?
ఒకప్పుడు దర్శకులు సిట్యువేషన్ గానీ, కాన్సెప్ట్ గానీ చెప్పి ట్యూన్ కావాలని అనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మందికి అది తెలియడం లేదు. సీన్స్ గురించి చెప్తారు. కానీ సీన్‌లో ఏం చెప్పాలని అనుకుంటారు.. దాని కాన్సెప్ట్ ఏంటి? ఎలాంటి పాట కావాలని చెప్పలేకపోతోన్నారు.. సినిమా కాన్సెప్ట్‌ని కూడా మాకు సరిగ్గా వివరించలేక పోతోన్నారు. కాన్సెప్ట్ చెప్తే గానీ ఓ లిరిసిస్ట్ సాహిత్యాన్ని రాయలేడు, నేను ట్యూన్ ఇవ్వలేను.

మ్యూజిక్ విషయంలో క్రెడిట్స్ మిస్ అవ్వడం, వేరే వాళ్లకి క్రెడిట్స్ వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి?
‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది. రామ్ మిర్యాల గారు కూడా రెండు పాటలు ఇచ్చారు. మిగతాది అంతా నేను చేశాను. కానీ పేరు మాత్రం ఆయనదే కనిపించేది. మీడియాలో అలా తప్పుగా వెళ్లింది. అందుకే ప్రతీ ఈవెంట్‌లో బన్నీ వాస్ గారు నా పేరుని చెబుతూ ఉండేవారు. మీడియాలో కొన్ని చోట్ల అలా వచ్చిన దాన్ని బన్నీ వాస్ గారు కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్’ టైంలో నా పేరు కాకుండా ఎవరి పేరో కనిపించింది.  నేను మాత్రం నా టీంలో ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ ఇస్తాను.

పదేళ్ల జర్నీపై మీరు సంతృప్తిగా ఉన్నారా? 
పేరుకి పదేళ్లు అయినా మధ్యలో చాలా టైంని కరోనా తినేసింది. నా ఈ జర్నీలో నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ఎలాంటి సినిమాకి అయినా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ మూవీకి కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను. ఈ పదేళ్లలో నేను ఈ కాన్ఫిడెన్స్‌ను సంపాదించుకున్నాను. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

Pawan Kalyan garu Personally Called Me and Spoke to Me After Seeing My Work –Music Director Ajay Arasada