Advertisementt

సినీజోష్‌ రివ్యూ: బాహుబలి2

Fri 28th Apr 2017 06:43 PM
telugu movie bahubali 2,bahubali 2 movie review,rajamouli latest movie bahubali 2,prabhas and rajamouli movie bahubali 2,bahubali 2 telugu review in cinejosh,bahubali 2 movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: బాహుబలి2
cinejosh review: bahubali2 సినీజోష్‌ రివ్యూ: బాహుబలి2
సినీజోష్‌ రివ్యూ: బాహుబలి2 Rating: 3.5 / 5
Advertisement
Ads by CJ

ఆర్కా మీడియా వర్క్స్‌ 

బాహుబలి2 

తారాగణం: ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, నాజర్‌, సత్యరాజ్‌, సుబ్బరాజు తదితరులు 

సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌ 

సంగీతం: ఎం.ఎం.కీరవాణి 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

కథ: వి.విజయేంద్రప్రసాద్‌ 

మాటలు: సి.హెచ్‌.విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ జి. 

సమర్పణ: కె.రాఘవేంద్రరావు 

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి 

విడుదల తేదీ: 28.04.2017 

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది థౌజండ్‌ డాలర్స్‌ క్వశ్చన్‌. గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకుల మెదడుని తొలిచేస్తున్న ప్రశ్న. బాహుబలి చిత్రాన్ని అర్థాంతరంగా ముగించేయడంతో ప్రేక్షకులు నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. అయితే రెండో భాగంలో రాజమౌళి ఎలాంటి మ్యాజిక్‌ చెయ్యబోతున్నాడు? ఎలాంటి అద్భుతాలు చూపించబోతున్నాడు? అనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో సన్నగిల్లలేదు. అలా బాహుబలి2 కోసం అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడడం అనేది జరగలేదనే చెప్పాలి. ఏప్రిల్‌ 28న బాహుబలి2 విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించినప్పటి నుంచి ఆరోజు కోసం వెయిట్‌ చేశారు. ఎన్నో ప్రశ్నలతో బాహుబలి మొదటి భాగం ముగిసింది. మరి ఆ ప్రశ్నలకు ఈరోజు విడుదలైన బాహుబలి2లో రాజమౌళి ఎలాంటి సమాధానాలు చెప్పాడు? బాహుబలిని కట్టప్ప చంపడం వెనుక జరిగిన అసలు కథ ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

బాహుబలిని కట్టప్ప చంపడానికి ముందు ఏం జరిగిందనే కథతో సినిమా ప్రారంభమవుతుంది. అమరేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యానికి రాజుగా విజయదశమి రోజున పట్టాభిషేకం జరుగుతుందని శివగామి ప్రకటిస్తుంది. కాబోయే రాజుగా దేశంలోని స్థితిగతుల్ని తెలుసుకునేందుకు కట్టప్పతో కలిసి దేశ పర్యటనకు బయల్దేరతాడు బాహుబలి. అలా కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశపు యువరాణి దేవసేనను ప్రేమిస్తాడు. తమ దేశానికి రాజుని కాలేకపోయానన్న అవమానంతో వున్న భల్లాలదేవుడికి ఈ విషయం తెలుస్తుంది. దాంతో శివగామి దగ్గర ఓ మెలిక పెడతాడు. దాని వల్ల రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వాల్సిన బాహుబలి.. దేవసేనతో కలిసి అంత:పురాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విషయంలో భల్లాలదేవుడు పన్నిన కుట్ర ఏమిటి? దాని వల్ల అమరేంద్ర బాహుబలి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తను మామ అని ప్రేమగా పిలుచుకునే కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది? దేవసేనను భల్లాలదేవుడు 25 సంవత్సరాలు ఎందుకు బందీగా వుంచాడు? తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలిని కాపాడతానని శివగామి చెప్తుంది. ఆమె చేసిన పాపాలు ఏమిటి? తండ్రి వీరగాధను కట్టప్ప ద్వారా తెలుసుకున్న మహేంద్ర బాహుబలి ఏం చేశాడు? ఇన్ని అనర్థాలకు కారకుడైన భల్లాలదేవుడి ఆటను ఎలా కట్టించాడు? వంటి విషయాల గురించి లోతుగా వెళ్ళడం కంటే వాటిని స్క్రీన్‌పై చూస్తే ఆ అనుభూతే వేరు. 

అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. రెండు క్యారెక్టర్స్‌లోని వేరియేషన్‌ని అద్భుతంగా చూపించాడు. ప్రభాస్‌ నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో రాజమౌళి టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో ప్రభాస్‌ పెర్‌ఫార్మెన్స్‌ నభూతో నభవిష్యతి అన్నట్టుగా వుంది. నటనలో ప్రభాస్‌తో రానా పోటీపడి నటించాడు. రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటికైనా తెగించే క్రూరుడుగా రానా తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రభాస్‌తో తలపడే సీన్స్‌లో రానా నువ్వా నేనా అన్నట్టుగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. మొదటి భాగంలో డీగ్లామర్‌గా కనిపించిన దేవసేన రెండో భాగంలో అత్యంత సౌందర్యవతిగా అందర్నీ ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్‌ని అనుష్క మాత్రమే చెయ్యగలదు అనిపించేలా తన అంద చందాలతో, అభినయంతో ఆకట్టుకుంది. మొదటి భాగం కంటే రెండో భాగంలో కట్టప్ప క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఎక్కువగా కనిపించింది. కట్టప్ప అనేవాడు వుంటే ఇలాగే వుంటాడా అనిపించేలా సత్యరాజ్‌ ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇందులో కొత్తగా కనిపించే క్యారెక్టర్‌ కుమారవర్మ. ఈ క్యారెక్టర్‌తో సుబ్బరాజు అందర్నీ ఆకట్టుకున్నాడు. అక్కడక్కడ నవ్వించాడు కూడా. ఇక శివగామిగా రమ్యకృష్ణ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. రాజమాతగా హుందాతనాన్ని ప్రదర్శించింది. 

బాహుబలిలాంటి విజువల్‌ వండర్‌ని చూసిన ప్రేక్షకులు రెండో భాగంలో అంతకంటే అద్భుతాలు వుంటాయని ఆశించడంలో తప్పులేదు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కళ్ళు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేశాడు రాజమౌళి. మాహిష్మతి సామ్రాజ్యం, కుంతల దేశం అందాల్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. రాజమౌళి విజన్‌కు సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ, సాబు శిరిల్‌ ఆర్ట్‌ వర్క్‌, కమల్‌ కణ్ణన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రాణం పోశాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ ఓ అద్భుతం అనిపిస్తుంది. మొదటి భాగంతో పోలిస్తే గ్రాఫిక్స్‌ పరంగా రెండో భాగానికి తక్కువ మార్కులే పడతాయి. అయితే గ్రాఫిక్స్‌ కంటే కథ, కథనాలకు ఎక్కువ ప్రాధాన్యం వుండడంతో ఆ విషయం గురించి ప్రేక్షకులు ఆలోచించే టైమ్‌ వుండదు. సాంకేతిక విభాగంలో రాజమౌళి తర్వాత ప్రధానం చెప్పుకోవాల్సింది కీరవాణి గురించి. బాహుబలి మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయింది. బాహుబలి2 మాత్రం ఆడియో పరంగా వీక్‌ అనే చెప్పాలి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం కీరవాణి అదరహో అనిపించేలా చేశాడు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ని ఎలివేట్‌ చెయ్యడంలో కీరవాణి మ్యూజిక్‌ ఎంతో దోహదపడింది. ఒక విధంగా సినిమాని ఆసక్తికరంగా నడిపించింది కీరవాణి మ్యూజిక్కే. విజయేంద్రప్రసాద్‌ అందించిన కథలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఎన్నో వున్నాయి. వాటిని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు రాజమౌళి. సి.హెచ్‌.విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ జి. రాసిన మాటలు కూడా అర్థవంతంగా వున్నాయి. ఇక రాజమౌళి డైరెక్షన్‌ గురించి చెప్పాలంటే ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే ప్రజెంట్‌గా రాజమౌళికి తప్ప మరెవ్వరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2 గంటల 50 నిముషాల సినిమాలో రాజమౌళి కష్టం ప్రతి షాట్‌లో కనిపిస్తుంది. మహా అద్భుతం అనిపించేలా ఇంటర్వెల్‌ బ్లాక్‌ని రాజమౌళి డిజైన్‌ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా వుండలేం. అలాగే. క్లైమాక్స్‌ యుద్ధ సన్నివేశాలు, మహేంద్రబాహుబలి, భల్లాలదేవుడు మధ్య వచ్చే ఫైట్‌ సీన్‌ ఒళ్ళు గగుర్పొడిచేలా తీయడం రాజమౌళికే చెల్లింది. సినిమా నిడివి ఎక్కువే అయినా ఎన్నో అద్భుతాలతో కథ నడుస్తుండడంతో ఆ ఫీలింగ్‌ ఎవ్వరికీ రాదు. సినిమా అంత భారీగా రావడానికి, విజువల్‌గా వండర్‌ అనిపించడానికి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపించింది. ఫైనల్‌గా చెప్పాలంటే రాజమౌళి ఆలోచనల నుంచి బయటికి వచ్చిన మరో చిత్రరాజం బాహుబలి2. ఈ చిత్రంలో విజువల్స్‌ కంటే విషయానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన రాజమౌళి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: భళి భళి భళి..రా...జమౌళి

Click Here For Baahubali 1 Review

cinejosh review: bahubali2:

rajamouli latest movie bahubali 2 which is sequel to bahubali. prabhas, anushka, rana, ramyakrishna, satyaraj are the lead roles in this film. bahubali movie made with extraordinary visuals. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ