Advertisementt

స్పందన రివ్యూ : బాహుబలి

Fri 10th Jul 2015 11:39 PM
bahubali telugu review,baahubali movie review,prabhas bahubali review,ss rajamouli,bahubali the beginning review,bahubali talk,bahubali report,bahubali first day collections,bahubali records,bahubali revenue,telugu movie bahubali,telugu film bahubal  స్పందన రివ్యూ : బాహుబలి
స్పందన రివ్యూ : బాహుబలి
Advertisement
Ads by CJ

ఆర్కా మీడియా వర్క్స్‌

బాహుబలి

నటీనటులు : ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, 

నాజర్‌, ప్రభాకర్‌, అడవి శేష్‌, రోహిణి, తనికెళ్ళ భరణి తదితరులు

కథ : వి.విజయేంద్రప్రసాద్‌

ఆర్ట్‌ డైరెక్టర్‌ : సాబు శిరిల్‌

సినిమాటోగ్రఫీ : కె.కె.సెంథిల్‌ కుమార్‌

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సమర్పణ : కె.రాఘవేంద్రరావు

నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

విడుదల తేదీ : 10.07.2015

పరిచయాలు, ప్రస్తావనలు, ప్రత్యేక ఉపోద్ఘాతాలు ఏవీ అవసరం లేని విధంగా అమిత ప్రాచుర్యం పొందిన భారీ చిత్రం ‘బాహుబలి’. ‘ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌’  అనే ట్యాగ్‌తో ఒకేసారి నాలుగు భాషల్లో విడుదవుతోన్న ’బాహుబలి’ పట్ల సగటు సినీ ప్రేక్షకులే కాక భారతీయ చిత్ర పరిశ్రమంతా అమితాసక్తిని కనబరిచింది. ట్రైలర్స్‌లోని విజువల్స్‌తో సినిమాపై అంచనాలు వంద రెట్లు పెరిగిపోతే.. చిత్ర వర్గం చేసిన ఇంటర్వ్యూల హడావిడితో అభిమానుల ఆశలు అవలీలగా వంద కోట్లు దాటేశాయి. మూడేళ్ళ కఠోర శ్రమతో తమ సామూహిక స్వప్నానికి తెరరూపమిచ్చిన ‘బాహుబలి’ బృందం ఖచ్చితంగా ఓ అద్భుతాన్ని ఆవిష్కరించి తీరుతుందనే జనం నమ్మకాన్ని దర్శక ధీరుడు నిజం చేశాడా, నీరుకార్చాడా మీరే చదవండిక..!

కథ : విరివిగా సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ ‘బాహుబలి’ ట్రైలర్స్‌లోనే కథ ఏమై వుంటుందనే అంశంపై ఓ అవగాహన వచ్చేసి వుంటుంది. అందుకు భిన్నంగా ఇంకేదో చూపించే బరువేదీ నెత్తినెత్తుకోలేదు ‘బాహుబలి’. రాజమాత శివగామి (రమ్యకృష్ణ) వల్ల రక్షింపబడ్డ పసిబిడ్డ మనకు బాగా తెలిసిన ఫార్ములా ప్రకారం యశోద కృష్ణలా ఓ గ్రామంలో పెరుగుతాడు. పేరు మాత్రం కృష్ణుడు కాదండోయ్‌.. శివుడు(ప్రభాస్‌). తను ప్రేమించిన అవంతిక (తమన్నా) ఆశయాన్ని తన ఆశయం చేసుకుంటాడు. ఆమె కాపాడాల్సిన దేవసేన(అనుష్క)ను తను కాపాడి తెస్తానంటాడు. మహా బలవంతుడు, అతి క్రూరుడు అయిన భల్లాలదేవా(రానా) పరిపాలించే మాహిష్మతి రాజ్యంలో బందీగా వుంటుంది దేవసేన. ఆమెను విడిపించి తెచ్చే ప్రయత్నంలో ఆ రాజ్య సైన్యాధ్యక్షుడు కట్టప్ప(సత్యరాజ్‌) ద్వారా తను అమరేంద్ర బాహుబలి సంతానమనీ, ఆ దేవసేనే తన తల్లి అనీ తెలుసుకుంటాడు శివుడు. బాహుబలి ఎంత మంచివాడో, ఎంతటి పరాక్రమవంతుడో కట్టప్ప వివరించడం మిగిలిన కథ. మరి ముగింపేంటీ అంటారా... రెగ్యులర్‌ రివ్యూలో అయితే తెరపైనే చూడండి అని రాసెయ్యొచ్చు. బట్‌ ‘బాహుబలి’ ఆ ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా అందరినీ సెకండ్‌ పార్ట్‌ కోసం వేచి చూడమన్నాడు. సర్లెండి.. చూపించిన ఈ సగం కథలోనే కథనం ఎలా సా..గిందో చూద్దాం.

కథనం :రాజమౌళి పిక్చర్‌’ అంటే కథ కట్టి పడేస్తుంది. కథనం కదం తొక్కుతుంది. ప్రతి సన్నివేశం పసందుగా వుంటుంది. పాటైనా, ఫైటైనా కనువిందు చేస్తుంది. మరిప్పుడు అదే రాజమౌళి తీసిన ఈ ‘ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌’ లోనూ అదే జరిగిందా అంటే జక్కన గత సినిమాల స్థాయిలో జరగలేదని నిర్మొహమాటంగా చెప్పాలి. లేదా జరిగుంటే బాగుండేదని నిట్టూర్చాలి. సాదాసీదాగా ఆరంభమైన ‘బాహుబలి’ కథ తొలి గీతం వరకూ ఆకట్టుకునే పంథాలోనే అడుగులేసినా ఆపై ఆశించిన వాడినీ, వేడినీ కోల్పోయి నిదానంగా కదులుతుంది. ఓపక్క అమోఘమైన విజువల్స్‌ వీక్షకులను ఆకర్షిస్తూనే వున్నా సోసోగా సాగే ప్రభాస్‌, తమన్నాల లవ్‌ ట్రాక్‌ ఆ రేంజ్‌ మేకింగ్‌కి సరితూగలేకపోయింది. మరోపక్క మాహిష్మతి రాజ్య రూపకల్పన ఆశ్చర్యచకితులను చేస్తూనే వున్నా భల్లాలదేవ, దేవసేన, కట్టప్ప పాత్ర స్వరూప స్వభావాలను విపులంగా వివరిస్తూ వుండడంతో అది కొందరికి విసుగనిపించే విషయంగా మారింది. శివుడి వీరత్వాన్నీ, బాహుబలి విజృంభణనీ విరామం తరువాతే చూపిస్తానంటూ రాజమౌళి దాచేసుకోవడంతో సినిమాలోని తొలి సగం అసంతృప్తిని మిగుల్చుతుంది. ఆశలన్నిటినీ మలి సగం పైకి మళ్ళిస్తుంది. అయితే ద్వితీయార్ధంలో మాత్రం చాలా చోట్ల చెలరేగిపోయిన రాజమౌళి దర్శకత్వ నైపుణ్యం కొన్ని గ్రేట్‌ షాట్స్‌నీ, షార్ప్‌ సీన్స్‌నీ చూపించి శభాష్‌ దర్శక ధీరా అనిపిస్తుంది. ముఖ్యంగా వార్‌ ఎపిసోడ్‌ని వండ్రఫుల్‌గా పిక్చరైజ్‌ చేశారు. అయితే మేకింగ్‌పరంగా ఎన్నో మెట్లు పైకెక్కేసిన రాజమౌళి దర్శకుడిగా తన ప్రధాన బలమైన భావోద్వేగాలను మాత్రం ఈ కథలో కరెక్ట్‌గా మిళితం చేయలేకపోవడం ‘బాహుబలి’ని బలహీనంగా మార్చింది. అలాగే కాలకేయుల కోసం కనిపెట్టిన కొత్త భాష కూడా ఆ సౌండింగ్ కామెడీగా అనిపించడంతో తేలిపోయింది. ఇక అర్ధాంతరంగా వచ్చేసే ముగింపైతే కామన్‌ ఆడియెన్స్‌ వివిధ రకాల కామెంట్స్‌ చేసుకుంటూ బయటికి వెళ్ళే ఛాన్స్‌ ఇచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఓకే సినిమానే కానీ ‘బాహుబలి’పై ఏర్పడ్డ ఆశలకు, అంచనాలకు ‘ఓకే’ అంటే చాలదు కదండీ.. ‘ఓహో’ అనిపించే అవుట్‌పుట్‌ వచ్చుండాల్సింది.

నటీనటులు : మూడేళ్ళ కాలాన్నీ, ఎనలేని కష్టాన్నీ వెచ్చిస్తూ ‘బాహుబలి’ కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ని ప్రశంసించి తీరాలి. శ్రమించి, సాహసించి, అభినయించి అన్ని రకాలుగా ఆకట్టుకున్న ప్రభాస్‌ శివుడిగా మెరిసిపోయాడు. బాహుబలిగా వెలిగిపోయాడు. రానా కూడా భల్లాలదేవుని పాత్రకు తన ఎంపిక సరైనదేనని నిరూపిస్తూ నటుడిగా తన సత్తా చూపించాడు. క్రూరత్వం కలిగిన హావభావాలతోనే కాక స్వచ్ఛమైన ఉచ్ఛారణతోనూ మంచి మార్కులు కొట్టేశాడు. అనుష్క ఈ పార్ట్‌ వరకూ పూర్తి డీ గ్లామరైజ్డ్‌ షేడ్‌కే పరిమితమైంది. తమన్నా గ్లామర్‌ ఒలికించే బాధ్యత తీసుకుంది కానీ తనలో మునుపటి కాంతి కరువైంది. రాజమౌళి ముందునుంచీ చెప్పినట్టు శివగామి పాత్రకు రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రకు సత్యరాజ్‌, బిజ్జాలదేవా పాత్రకు నాజర్‌ ప్రాణం పోశారు. కాలకేయ పాత్ర కోసం భీకరమైన రూపం దాల్చిన ప్రభాకర్‌ తన ఆహార్యంతోనూ, ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన సుదీప్‌ తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తోనూ మెప్పించారు.

సాంకేతిక వర్గం : వరుస విజయాలు సాధిస్తూ, సినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకుంటూ దక్షిణాది అగ్ర దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ‘బాహుబలి’ని వండ్రఫుల్‌గా విజువలైజ్‌ చేశారనడంలో సందేహం లేదు. అయితే ఆయన క్వాలిటీ పైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేయడంతో కంటెంట్‌ ఎఫెక్ట్‌ అయింది. ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాల్లో అద్భుతంగా పండిన ప్రేమకథలు ఆ కథనాలకు ఆక్సిజన్‌గా మారితే ‘బాహుబలి’లోని లవ్‌ ట్రాక్‌ ఈ కథకే మేజర్‌ వీక్‌ పాయింట్‌ అయింది. అలాగని ఇది ప్రేమకథ కాదులే.. కొన్ని పాత్రల బాంధవ్యాలు, భావోద్వేగాలతో సాగే కథనం అనుకుందామంటే భావం తెలిపే సందర్భాలే తప్ప ఉద్వేగంగా సాగే సన్నివేశాలు కొరవడ్డాయి. ఈ పార్ట్‌లో ‘బాహుబలి’ని సెకండాఫ్‌ కోసం దాచినట్టు, ఈ కథలోని భావోద్వేగాలన్నిటినీ రాజమౌళి  సెకండ్‌ పార్ట్‌ కోసం దాచేసుకున్నారేమో.!

పంచ పాండవుల పవర్‌ని బాహుబలిగా, వందమంది కౌరవుల క్రౌర్యాన్ని భల్లాలదేవాగా మార్చి ఈ దాయాదుల గాథను సృష్టించారా అనిపించేట్టు ‘బాహుబలి’ కథను సిద్ధం చేసిన విజయేంద్రప్రసాద్‌ మహాభారతంలోని ప్రతి పాత్రకూ ఓ పరమార్ధం వున్నట్లే ఈ కథలోని ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకతను ఆపాదించే ప్రయత్నం చేశారు. అంతవరకూ ఆమోదయోగ్యమే అయినా కామా పెట్టి ఆపాల్సిన కథని క్వశ్చన్‌ మార్క్‌తో ఎందుకు ముగించారో.. ఎన్నో అంశాలను అర్ధరహితంగా వదిలేసి కట్టప్ప క్యారెక్టరే క్లైమాక్స్‌కి పెద్ద ట్విస్ట్‌గా ఎలా భావించారో ఆయనకే తెలియాలి. కీరవాణి తనదైన నేపథ్య సంగీతంతో, తనకు మాత్రమే సొంతమైన శైలిలో ‘బాహుబలి’ని అప్పుడప్పుడూ అంతెత్తుకు లేపేసినా ఎక్కడికక్కడ మాత్రం ఆయన ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుండాలనిపించింది. పాటల్లో ‘శివుని ఆన’కే ఆడిటోరియంలో ఎక్కువ ఆదరణ లభించింది. ఇక ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు శిరిల్‌, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ రాజమౌళి కలకు రూపమివ్వడంలో తమ ప్రావీణ్యాన్నంతటినీ తెరపై పరిచారు. వీరిద్దరి పనితనమే మాహిష్మతి రాజ్యాన్ని ప్రతి ఫ్రేమ్‌లోనూ రంగ రంగ వైభవంగా చూపిందనడంలో సందేహం లేదు. అలాగే సీనియర్‌ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస మోహన్‌, ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌తో బాటు ఇతర టెక్నీషియెన్స్‌ అందరూ కూడా అభినందనీయులే. ఎందుకంటే కంటెంట్‌ వైజ్‌ ఎలా వుందో ఎనలైజ్‌ చెయ్యొచ్చు కానీ ఎఫర్ట్‌ వైజ్‌ మాత్రం యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ ఎప్రిషియేట్‌ చేసే తీరాల్సిన అవుట్‌పుట్‌ ఇది.

ప్లస్‌ పాయింట్స్‌ : ప్రభాస్‌, రానా పెర్‌ఫార్మెన్స్‌

                   రాజమౌళి విజువలైజేషన్‌

                   యుద్ధ సన్నివేశాలు

                   గ్రాఫిక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ : నిదానంగా సాగే కథనం

                      వీక్‌ లవ్‌ ట్రాక్‌

                      సరైన స్థాయిలో లేని భావోద్వేగాలు

                      హఠాత్తుగా వచ్చేసే ముగింపు

ఫినిషింగ్‌ టచ్‌ : రాజమౌళి తీసిన సినిమాలన్నిటికీ వేరే సినిమాలతో పోలికలు తెస్తూ, ఆయన తీసే షాట్స్‌కీ, వేసే పోస్టర్‌కీ, చేయించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కీ అన్నిటికీ రిఫరెన్సులు చూపించేసే ఔత్సాహికులకు ‘బాహుబలి’ కూడా చాలా పని కల్పిస్తుంది. ఆ పనిలో వాళ్ళెలాగూ వుంటారు కానీ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఒకటుంది.

కొడుకు కళ్ళ ముందే తల్లిని వక్ర దృష్టితో చూడడం, వంకర మాటలు మాట్లాడ్డమే హేయంగా అనిపించే విషయమైతే తల్లీ కొడుకుల బంధాన్నే వక్రీకరించడం దారుణం. ఈ సినిమాలో ఆ రెండూ జరిగాయి. కథానాయకుడిలో పౌరుషాగ్ని రగిలేందుకు రెండుసార్లూ అదే కారణం కనిపించిందా విజ్ఞుడైన విజయేంద్రప్రసాద్‌కు.?

ఆశయం, పోరాటం, ప్రాణ త్యాగం అంటూ మాట్లాడే అవంతిక పాత్ర ఒక్కసారిగా ప్రేమలో పడిపోవడమే కాకుండా శారీరక సుఖం కోసం తపించిపోతున్నట్లు వస్త్ర సన్యాసం చేసేసి శివుడిపై వాలిపోవడం సమంజసమనిపించిందా దర్శక ధీరుడు రాజమౌళికి.?

ఇలా క్వశ్చన్‌ చేసే విషయాలు, కామెంట్‌ చేయదగ్గ విపరీతాలు, కామెడీగా అనిపించే విశేషాలు ఇంకొన్ని వున్నాయి కానీ చూపించింది> సగం సినిమానే కనుక మనమూ ఈ కౌంటింగ్‌నీ రేటింగ్‌నీ> సగానికే సరిపెడదాం.! 

సినీజోష్‌ రేటింగ్‌ : 1.25/2.5

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ