PR పంచ్: "గుర్తింపు"ని కొట్టేసిన శిష్యులు..

PR PunchPR Punch

తెలుగు సినిమా ప్రపంచంలో సుకుమార్ అంటే బ్రాండ్.. ఆయన రాసే కథ, కథనంలో కొత్త దనం ఉంటుంది అని సినిమా ప్రేమికులు నమ్ముతూ వుంటారు. కానీ ఇప్పుడు అదే బ్రాండ్ కి ఆయన శిష్యులే ఎసరు పెడుతున్నారా? అనే డౌట్ వస్తోంది.. ఎందుకంటే గురువు కష్టపడి సంపాదించుకున్న "గుర్తింపు" అనే బ్రహ్మాస్త్రాన్ని.. శిష్యులు.. తస్కరించారా.. అనిపిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకొన్న సుకుమార్ ఒక ఫార్ములాని కనిపెట్టారు. అది చాలా సింపుల్.. చాలా పవర్ ఫుల్.. జీరో లా వుండే హీరో కి ఒక "గుర్తింపు" లేకుండా ఉండటం.. ఆ "గుర్తింపు" కోసం, వాడు ప్రపంచం తో యుద్ధం చేసి గెలవాలి. అటువంటి ప్రయత్నమే.. "పుష్ప". పుష్పలో హీరో కి "ఇంటి పేరు" లేదు. నా తండ్రి ఎవరు? అనే ఒక్క ప్రశ్న అతన్ని రాక్షసుడిని చేసింది. ఆ బాధతో.. పచ్చని ఎర్ర చందనం చెట్లుని తెగనరికి, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొంటాడు. ఆ భాదలో నిజాయితీ ఉంది. ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంది. అందుకే ఆ పాయింట్ సూపర్ డూపర్ హిట్ అయ్యి సుకుమార్ పేరు సినిమా ప్రపంచంలో ఇది నా బ్రాండ్ అనేలా ఆయన పేరు మారుమోగిపోయింది.
ఇక ఇప్పుడు ఈయన శిష్యులు.. గురుంచి చెప్పుకోవాలి.. గురువు సుకుమార్ వద్ద నుండి డైరక్షన్ లో మెలుకువల తో బాటు.. ఆయన "గుర్తింపు" అనే ఫార్ములా.. ని కొట్టేసి ఆయన బాటలో అటు ఇటుగా కొత్తగా ఆలోచించకుండా, కధలు తయారు చేసుకొని, గురువు గారి పేరు ఉపయోగించుకొని, భారీ నిర్మాతల దగ్గర సినిమాలు ఓకే చేయెంచుకొని రంగంలోకి దిగారు.  
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. 
గురువు ఇంటి పేరు అంటే.. నేను ఊరి పేరు అంటా!" అంటూ.. మా ఊరికి "గుర్తింపు" లేదు.. మా ఊరికి మ్యాప్ లో చోటు లేదు!" అని హీరో ఏడుస్తాడు.. సేమ్ టు సేమ్ గురువు పాయింటే.. కానీ రేంజ్ మార్చాడు.. హీరో ఏకంగా మూడు గేమ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి.. చివరకు ఎవర్ని ఏమి అనలేక తన కాలుని తానే నరుక్కొని.. దేశంలో తన ఊరుకి పేరు.. "గుర్తింపు" తీసుకొస్తాడు. "పెద్ది " ఇక్కడ వరకు బాగానే వుంది కానీ.. జనం ఏమనుకున్నారు? "ఇది ఎక్కడో విన్నట్టు ఉందే.. "పుష్ప"లో ఇంటి పేరు లేదన్నాడు.. ఇక్కడ ఊరి పేరు లేదంటున్నాడు!" అనుకున్నారు.. గురువు ఒరిజినాలిటీ ని బుచ్చి బాబు.. "గుర్తింపు" పాయింట్ ని తస్కరించబడింది.. అని ఆ సినిమాని పర్లేదు అనిపించారు ప్రేక్షకులు.
ఇంకో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల
ఈయన ఇంకో అడుగు ముందుకు వేశాడు.. "ఇంటి పేరు, ఊరి పేరు అయిపోయాయి.. నేను జాతి పేరు అంటా!" అన్నాడు. "మా జాతికి గుర్తింపు లేదు!" అని నాని తో కత్తులు పట్టించి.. మనుషుల తలలు.. పుచ్చకాయల్లా.. తెగనరుకుతూ.. రక్త సునామి క్రియేట్ చేసాడు. ఇక్కడ కూడా "గుర్తింపు" అనే పాయింటే.. కానీ ఇక్కడ బాధ పోయి.. కసి వచ్చింది.. ఎమోషన్ పోయి.. వయొలెన్స్ వచ్చింది..
దీంతో జనం పూర్తిగా తేల్చేశారు.. అరే.. సుకుమార్ దగ్గర ఉన్నది ఇదొక్కటే పాయింటా? శిష్యులందరూ ఇదే తిప్పి తిప్పి తీస్తున్నారా?" అని.. ట్రోల్స్ చేసే విధంగా.. "పారడైస్" రిజల్ట్ మారిపోయింది.
గురువు సుకుమార్ గుర్తింపుని కొట్టేయడం కాదు.. ఆ గుర్తింపుని అర్థం చేసుకోకుండా కొట్టేయడం. సుకుమార్ "గుర్తింపు లేదు" అనే పాయింట్ ని బలంగా.. బాధగా చూపించాడు.. అందుకే మనం ఏడ్చాం. కానీ శిష్యులు దాన్ని భారంగా చూపించారు. "గుర్తింపు" లేదు.. కాబట్టి నరికేసుకుంటాను, నరికేస్తా అన్నారు. అందుకే ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కాలేక పోయారు. 
ఒక మంచి పాయింట్ ని పదే పదే వాడి.. ఇదే హిట్ ఫార్ములా అంటే ఎలా..? అని సినిమా అభిమానులు మండిపడుతున్నారు. గురువు సుకుమార్ "గుర్తింపు" అనే పాయింట్ తో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే.. శిష్యులు ఆ బ్రాండ్ ని, ఒకరు ఊరి పేరుతో, ఇంకొకరు జాతి పేరుతో, సినిమాలు తీయడం.. ఎంత వరకు సబవు అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తు లో ఇంకో సుకుమార్ శిష్యుడు ఎవరైనా..  డైరెక్టర్ గా మారితే.. అతను కూడా ఇదే ఫార్ములా వాడ్తారా..? అని ప్రశ్నించే స్థాయికి వీరి సినిమాలు కొన్ని మెట్లు దిగిపోయాయి.
గురువు గుర్తింపుని నిలబెట్టాల్సిన శిష్యులు.. ఆ "గుర్తింపు"ని పాడుచేయకుండా, భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు తీసి గురువుని మించిన శిష్యులు గా ముందుకు దూసుకుపోవాలి అని ఆశిద్దాం..

Disciples who made their mark Buchibabu and Srikanth Odela