సినిమా ఏదైనా .. స్టార్ ఎవరైనా.. ఎంపిక చేసుకున్న కథలో డివోషనల్ టచ్ ఉంటే చాలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రధాన ప్లాట్‌కి భక్తితో కూడుకున్న సన్నివేశాలు అదనపు ఆక్సిజన్‌ని అందిస్తున్నాయి. సనాతన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గానికి ప్రజలు నిరంతరం ఆకర్షితులవుతూనే ఉన్నారు. దేవాలయాల్ని సందర్శించే సంస్కృతి మనది. అందుకే సినిమాలకు భక్తి టచ్ ఉన్న ఎపిసోడ్లు ఎప్పుడూ అదనపు బలంగా మారుతున్నాయి. ఇవి కథలో బలం పెంచి, కాసుల కుంభవృష్టికి సహకరిస్తున్నాయి.
బాహుబలి జానపద సనిమా అయినా శివుడి ఎపిసోడ్ ఎలివేట్ అయింది. కల్కి 2898 ఎడి సోషియో ఫాంటసీ సినిమా అయినా కానీ కర్ణుడి ఎపిసోడ్ ఎలివేట్ అయింది. పుష్ప2 పక్కా కమర్షియల్ సినిమా అనుకున్నా అమ్మవారి జాతర వర్కవుటైంది. చిన్న సినిమాల్లో కార్తికేయ, కార్తికేయ 2 డివోషనల్ టచ్‌తో పెద్ద సక్సెసయ్యాయి. విరూపాక్ష లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ ని మిక్స్ చేసి ఆకర్షించారు. ఇవన్నీ ఇటీవలి కాలంలో బంపర్ హిట్లు కొట్టిన సినిమాలు. డివోషనల్ టచ్‌తో రీచ్ పెరిగిందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఇటీవల అందరూ భక్తి బాట పడుతున్నారు.
చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆంజనేయ స్వామి భక్తుడిగా కనిపిస్తాడు. డివోషనల్ టచ్ సినిమా ఆద్యంతం నడిపిస్తుంది. ఇంద్రలోకం నుంచి భువికి దిగివచ్చే అతిలోక సుందరి వెంటపడే సామాన్య మానవుడిగా చిరంజీవి నటించారు. 90లలో వరదల్లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు విశ్వంభర లో చిరంజీవి మరోసారి డివోషనల్ ఎపిసోడ్స్ ని పండిస్తూ సన్నివేశాల్ని రక్తి కట్టిస్తారని తెలుస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో గాడ్ ని కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫాంటసీ సినిమాకి అదనపు హంగులు అద్దనున్నారు. పరిశ్రమ అగ్ర కథానాయకుడు చిరంజీవి స్వతహాగానే ఆంజనేయ స్వామి భక్తుడు. చిరు కెరీర్ ఎదుగుదలలో భక్తి, భావాలు ఆయనకు సహకరించాయని స్వయంగా అంగీకరించారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ స్వతహాగానే భక్తి తత్పరత, పెద్దలను, సంస్కృతిని గౌరవించే సున్నిత మనస్కుడు. ఆయన సినిమాల్లో డివోషనల్ టచ్ తప్పనిసరి. బోయపాటితో బాలయ్య సినిమాలన్నిటిలో డివోషనల్ టచ్ ని చూస్తూనే ఉన్నాం. అఖండలో కఠోర తపస్సుతో శక్తివంతుడైన అఘోరాగా కనిపించిన బాలయ్య మహదేవుని భక్తుడిగా కనిపిస్తారు. ఇప్పుడు అఖండ 2లోను ఇలాంటి డివోషనల్ టచ్ కి కొదవేమీ లేదని తెలుస్తోంది. బాలయ్య తన సినిమాల్లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి భక్తుడిగాను కనిపించారు. భక్తి టచ్ అనేది బాక్సాఫీస్ కుంభవృష్టికి సహకరించిందే కానీ, దానివల్ల నష్టమేమీ లేదు.
టాలీవుడ్ హీరోల్లో పూర్తి స్థాయి భక్తి సినిమాల్లో నటించిన హీరోగా నాగార్జునకు ఒక రికార్డ్ ఉంది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ వంటి భక్తిరస చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. కమర్షియల్ సినిమా కింగ్`గా ఏలిన నాగ్ ఒక భక్తుడిగా కనిపించడం నిజంగా అసాధారణ ప్రక్రియ. నా సామి రంగ లాంటి కమర్షియల్ సినిమాలోను డివోషనల్ టచ్ ఉన్న సీన్స్ ప్రధానంగా హైలైట్ అయ్యాయి. యాధృచ్ఛికంగానో యథాలాపంగానో విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల సినిమాలో గోపాలుని లీలలేంటో చూసారు. అది డివోషన్ ని సాధారణ ప్రజల సమస్యలకు కనెక్ట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రంగా నిలిచింది. ఇందులో గోపాలుడి (దేవుడు) పాత్రలో పవన్ కల్యాణ్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే.
బాహుబలిలో శివుడిని ప్రార్థించే వీరుడిగా ప్రభాస్ కనిపించాడు. శివలింగాన్ని ఎత్తి జలపాతం వద్దకు చేర్చే సన్నివేశం ఎమోషనల్ గా జనాలకు కనెక్టయిన సంగతి తెలిసిందే. గిరిజన సమాజంలో నివశిస్తున్నా, ప్రభాస్ వీరుడు అనే విషయం ఇలాంటి సన్నివేశాలు హైలైట్ చేసి చూపించాయి. బాహుబలి కథలో డివోషనల్ టచ్ చాలా పెద్ద ప్లస్ అయింది.
పుష్ప 2 లో అమ్మవారి జాతర ఎపిసోడ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొన్ని నిమిషాల పాటు గగుర్పాటుకు గురి చేసే, ఉద్రేకం కలిగించే నట ప్రదర్శనతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకే కాదు, లాజిక్కులు వెతికే విమర్శకులను కూడా మెప్పించారు. అమ్మవారు పూనిన పుష్పరాజ్‌గా బన్ని నటనకు మంచి పేరొచ్చింది. సినిమాలో ఈ కీలకమైన ఎపిసోడ్ ని సుక్కూ రక్తి కట్టించేలా ఎలివేట్ చేసారు. చాలా తెలివిగా అమ్మవారి ఎపిసోడ్ ని క్లైమాక్స్ కి కనెక్ట్ చేసి అద్భుతంగా కాసులు కురిపించుకున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ దేవరలో ఆయుధ పూజ సాంగ్ హైలైట్. డివోషనల్ కనెక్టివిటీ మిస్ కాకపోవడం ఈ సినిమాకి ప్లస్ అయింది. తదుపరి దేవర 2 తప్పకుండా చేస్తానని అన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమాలోను ఏదో ఒక చోట డివోషనల్ కనెక్షన్ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ విరూపాక్షలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, భక్తి కనెక్టివిటీ ఎగ్జయిట్ చేస్తుంది. ఈ సినిమా విజయంలో ఇది కూడా కీలక భూమిక పోషించింది. అదే తరహాలోనే రాయలసీమ కరువు నేపథ్యంలో రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాలోను భక్తి ఎలిమెంట్ ని బలంగా చూపిస్తున్నారని టాక్ ఉంది.
నాగచైతన్య కథానాయకుడిగా విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డివోషనల్ టచ్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు నిఖిల్ కెరీర్ కి పెద్ద ప్లస్ గా నిలిచాయంటే ఈ సినిమాల్ని చందు మొండేటి భక్తి అనే ప్రధాన ఎలిమెంట్ కి కనెక్ట్ చేసి థ్రిల్లింగ్ గా రూపొందించడమే. తదుపరి స్వయంభు`లోను డివోషనల్ టచ్ ఉంది. నిఖిల్ యోధుడిగా కనిపించినా భక్తి అనే ఎలిమెంట్ కూడా సినిమాని డ్రైవ్ చేయనుందని సమాచారం. నాని తదుపరి దసరా దర్శకుడు తెరకెక్కిస్తున్న ప్యారడైజ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోను డివోషనల్ టచ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం సొంతంగా నిర్మించి హిట్టు కొట్టిన క సినిమాలో ఆ డివోషనల్ టచ్ తోనే బయటపడ్డాడు. మంచి చెడు కర్మ సిద్ధాంతం ని ఈ సినిమాలో థ్రిల్లింగ్ మోడ్ లో బాగా ఎలివేట్ చేసారు.
కన్నడలో కాంతార పూర్తిగా జానపదం డివోషన్ జత చేసి రూపొందించిన చిత్రం. ఇది పాన్ ఇండియన్ సినిమాగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసినదే. ఈ సినిమాకి సీక్వెల్ కాంతార- ఏ లెజెండ్ ని తెరకెక్కించడంలో రిషబ్ శెట్టి తలమునకలుగా ఉన్నాడు. ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో రిషబ్ శెట్టి పరమశివుడిని పూజించే కఠోరమైన భక్తుడి అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ సినిమాలో భక్తి ఎలిమెంట్ ని జానపదాన్ని మరో స్థాయిలో ఎలివేట్ చేస్తారని సమాచారం.
పురాణేతిహాసాలతో సంబంధం, దేవుళ్లతో ప్రత్యక్షమైన కనెక్టివిటీ, సనాతన మూలాలు ఉన్న భారతదేశంలో డివోషనల్ కంటెంట్ కి జనాదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే సినిమాని కమర్షియల్ కోణంలో ఎలివేట్ చేస్తూ ఈ ఎలిమెంట్ ని సమర్థంగా ఉపయోగించుకోగలిగితే బాక్సాఫీస్ కి ఎలాంటి డోఖా ఉండదు.